పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా భామిని మండలం లివురి గ్రామంలో గల గోపినాథ మందిరం డోలాయాత్ర ఉత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలు, గజపతిమహారాజుల చివరి వంశీయులు యువరాణి కల్యాణీ దేవి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, తదితరులు లివురి గోపినాథ మందిరాన్ని దర్శించుకుని హోలీ పండుగను నిర్వహించారు. పర్లాకిమిడి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి మహారాజా అనేక ఏళ్లక్రితం నిర్మించిన గోపినాథ మందిరంలో పదిరోజులపాటు డోలా యాత్ర ఉత్సవాలు జరుపుతారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందిస్తారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.20 ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. ఈ జాతర జరుగుతున్న పదిరోజుల పాటు రైల్వే అధికారులు విశాఖపట్నం–గుణుపురం ప్యాసింజరు రైలు, పూరీ– గుణుపురం ట్రైన్లు కాశీనగర్ బ్లాక్ లివురి రైల్వేష్టేషన్ వద్ద రెండు నిమిషాలు స్టాపేజీ ఉంటుందని ఈస్టుకోస్టు రైల్వే అధికారులు తెలియజేశారు. లివురి వద్ద యాత్రికులు దిగి వంశధార నది దాటి లివురి గ్రామం చేరుకోవచ్చు. ఇటీవల ఒడిశా ప్రభుత్వం వంశధార నదిపై వంతెన లివురి గ్రామానికి నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల విద్యార్థులు అటు ఆంధ్రలో ఒడియా ప్రజలు ఒడిశా కాశీనగర్‌లో ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుందని లివురి గ్రామస్తులు అంటున్నారు.


