అధికారుల సెలవులు రద్దు
భువనేశ్వర్: నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని శ్రీమందిరానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో రద్దీ నియంత్రణ, ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కార్యకలాపాల నిర్వహణ నేపథ్యంలో పూరీ జిల్లా యంత్రాంగం డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు అన్ని జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసింది. పూరీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ దివ్య జ్యోతి పరిడా ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత కల్పించి సందర్శకులకు సముచిత సౌకర్యం కల్పించేందుకు అధికారులను అనుక్షణం అందుబాటులో ఉంచేందుకు సెలవులు రద్దీ చేయడం జరిగిందని కలెక్టరు వివరించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం అధికారులందరూ తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అటవీ భూమి పట్టాల పంపిణీ
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి డుడుమేట్లా పంచాయతీ దుబేల్‌గూడ గ్రామంలో మంగళవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ అటవీ హక్కుల చట్టం–2006 (సవరణ నిబంధనలు –2012) ప్రకారం అటవీ గ్రామంగా గుర్తింపు పొందిన దుబేల్‌గూడ గ్రామానికి చెందిన 52 కుటుంబాలకు 156 పట్టాలు పంపిణీ చేవారు. మరింతమందికి త్వరలో అందజేస్తామని మల్కన్‌గిరి అటవీ శాఖ రేంజర్ రమేష్ రౌతు తెలిపారు. కార్యక్రమంలో కోరుకొండ ఫారెస్ట్ అధికారి జ్యోతి డుంగ్ పాల్గొన్నారు.
రెగ్యులర్ వర్కింగ్ డే
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీజగన్నాథుడు రాష్ట్ర ప్రజలకు శాంతి, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తన కార్యాలయానికి ఎవరూ రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనవరి 1 సాధారణ ప్రభుత్వ పని దినమని, అధికారిక పనులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.


