పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలి
పారిశ్రామికవేత్తల ఆశాభావం
కొనసాగుతున్న చొయితి ఉత్సవాలు
రాయగడ: అపార ఖనిజ వనరులున్న రాయగడ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చేయూతనివ్వాలని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉత్సవాలకు మైత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.శ్రీనివాసరావు, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లోయిస్ లిమిటెడ్ (ఇంఫా) జనరల్ మేనేజర్ మామిడాల శ్రీనివాస్, ఆదిత్యా అలూమిన రిఫైనరీ యూనిట్ హెడ్ మజూర్ బేగ్, ఉత్కల అలూమిన ఇంటర్నేషనల్ లిమిటెడ్ యూనిట్ హెడ్ రవినారాయణ మిశ్రాలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ.. పరిశ్రమలు ఏర్పాటైతే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ప్రోత్సాహం అవసరం
ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు సరైన ప్రోత్సాహం లభించకపోవడంతోనే ఆయా రంగాల్లో రాణించలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రగతికి పెద్దపీట వేయాలని కోరారు. కలెక్టర్, చొయితీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అశుతోష్ కులకర్ణి మాట్లాడుతూ చొయితీ ఉత్సవాల్లో ఈసారి స్థానిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఆదివాసీ భాష, సంస్కృతికి అద్దంపట్టే ఈ ఉత్సవాల్లో అవకాశం కల్పించడంతో అందుకు అనుగుణంగా వారి ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు డైరక్టర్ చంద్రకాంత్ మాఝి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఏడీఎం నవీన్‌చంద్ర నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ అతిథులకు స్వాగతం పలికారు. చివరిగా చొయితీ ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలిపొందినవారికి వేదికపై బహుమతులు అందజేశారు.
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలి
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలి


