ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం
పర్లాకిమిడి: ఖరీఫ్ సీజన్‌లో పండించిన రైతులందరి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ప్రాంతీయ మార్కెట్ కమిటీ (ఆర్‌ఎంసీ) గిడ్డంగి వద్ద ఖరీఫ్ 2025–26 ధాన్యం మండీలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది సంక్రాంతి సమీపించినా ధాన్యం మండీలు జిల్లాలో అధికారులు సకాలంలో తెరవలేకపోయారన్నారు. ధాన్యం కొనుగోళ్ల టోకెన్స్ తక్కువుగా వచ్చాయని పేర్కొన్నారు. అవకతవకలు జరగకుండా ప్రతీ మండీలో ఎమ్మెల్యే ప్రతినిధులను నియమిస్తానని వెల్లడించారు. అనంతరం సబ్ కలెక్టర్, సీఎస్‌వో అనుప్ పండా మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం మొదటి విడతలో 3,36,000 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సాధారణ ధాన్యం క్వింటాకు ఇన్‌పుట్ సబ్సిడీతో కలిపి రూ.3,169లు, ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ.3,189లు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం కలిపి 6 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం


