రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద 12.500 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ఆర్.గోవిందగా పోలీసులు గుర్తించారు. ఎప్పటిలాగే సోమవారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగును తనిఖీ చేశారు. అందులో గంజాయి పట్టుబడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఐఐసీ బినయ్ ప్రకాష్ మింజ, అలోక్ నాయక్, ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ జగ్గారావు, ఏఎస్‌ఐ మానిక్ చంద్ర గౌడో, ఏఎస్‌ఐ శుభేందు పండ తదితరులు పాల్గొన్నారు.
పత్రికలు వారధిలా పనిచేయాలి
జయపురం: పత్రికలు ప్రజలు, పాలకుల మధ్య వారధిలా పనిచేయాలని సీనియర్ న్యాయవాది మదన మోహన్ నాయిక్ సూచించారు. స్థానిక యాదవ భవనంలో ‘సభువర్గ కబురొ’ ఒడియా వార పత్రిక 7వ వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని ప్రగతి మార్గంలో నడిపే బాధ్యత పత్రికలదేనని అభిప్రాయపడ్డారు. పత్రికలు నిర్భయంగా, నిజాయితీగా వాస్తవాలను ప్రజలకు అందించిననాడే మనుగడ సాగించగలవని పేర్కొన్నారు. పత్రిక సంపాదకుడు చంద్రకాంత సుతార్ మాట్లాడుతూ గత ఏడేళ్లుగా పత్రికను నడపడంలో తన అనుభవాలను వివరించారు. తన పత్రికకు ప్రస్తుతం అవిభక్త కొరాపుట్‌లోని రాయగడ, మల్కనగిరి, నవరంగపూర్, కొరాపుట్ జిల్లాల్లో మంచి ఆదరణ ఉందన్నారు. మరిన్ని జిల్లాలో విస్తరించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్‌ఆర్ ప్రాజెక్టుల పరిశీలన
రాయగడ: జిల్లాలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శి యామిని సాడంగి సోమవారం పర్యటించారు. దీనిలో భాగంగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణితో కలిసి టికిరి సమితి పరిధి దొరగుడ వద్దనున్న ఉత్కళ అలూమిన కర్మాగారంలో పర్యటించి సీఎస్‌ఆర్ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. బిలామాల్‌లో సౌరశక్తితో నడిచే శీతల గిడ్డంగి, రోస్టెడ్ మిల్లెట్ యూనిట్‌ను సందర్శించిన ఆమె ఆయా ప్రాజెక్టుల పనితీరును పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలో ఇటువంటి తరహా ప్రాజెక్టులను కర్మాగారం యాజమాన్యం ఏర్పాటు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు. స్థానికంగా ఉన్న సుమారు 180 మంది రైతులు తాము పండించిన ఉత్పత్తులను భద్రపరుచుకునే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కర్మాగారం పరిసర గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్‌ఆర్ ద్వారా వివిధ అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా రోస్టెడ్ మిల్లెట్ యూనిట్‌ను సందర్శించి రాగులతో తయారవుతున్న బిస్కెట్లు, కేక్ తదితర పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉత్కళ అలూమిన కర్మాగారం యూనిట్ సీఎస్‌ఆర్ లోపముద్ర మిశ్రా, యూనిట్ హెడ్ రవినారాయణ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
చెత్తకుప్పలో పసికందు మృతదేహం
రాయగడ: అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్ని చెత్తకుప్పలో గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళా కళాశాల వెనుక ఉన్న చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గమనించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.
రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం
రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం


