వేకువజాము నుంచే జగన్నాథుని దర్శనం
భువనేశ్వర్: జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం పురస్కరించుకొని పూరీ విచ్చేసే భక్తులు, యాత్రికులకు సులభ దర్శనం సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా తెల్లవారుజామున 2 గంటలకు శ్రీమందిరం ప్రధాన ద్వారాలు తెరుస్తారని జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు.
పొహిలి భోగం ఆచార వ్యవహారాల వేళలు ఖరారు అయ్యాయి. డిసెంబర్ 31న రాత్రి 11 గంటలకు రాత్రి పవళింపు సేవ జరుగుతుంది. ఆ తర్వాత 2026 జనవరి 1 తెల్లవారుజామున 2 గంటలకు ద్వారాలు తెరుస్తారు. నూతన సంవత్సర దినోత్సవం నాడు ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రద్దీ నియంత్రణలో భాగంగా ఆలయ ద్వారాలు ముందస్తుగా తెరిచేందుకు నిర్ణయించినట్లు వివరించారు. భక్తులకు సజావుగా మరియు సురక్షితమైన ఏర్పాట్లు మధ్య సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పూరీ పట్టణంలో వాహనాల రాకపోకల నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. పూరీ పట్టణం అంతటా 60 ప్లాటూన్ల పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.


