150 కొత్త అంబులెన్స్‌ల ప్రారంభం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం కళింగ స్టేడియంలో 150 అంబులెన్స్‌లను ప్రజా సేవకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.111 కోట్లు ఖర్చు చేసి 428 అంబులెన్స్‌లు సేవా రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వాటిలో తొలి విడత కింద 150 కొత్త అత్యవసర అంబులెన్స్‌లను (ఈఎంఏఎస్) ప్రారంభించారు. 108 అంబులెన్స్‌ల ద్వారా నిత్యం 5,000 మంది రోగులను రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత మెరుగుపరచడానికి పాత అంబులెన్స్‌లను దశలవారీగా కొత్త అంబులెన్స్‌లతో భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సేవను మరింత వేగవంతం చేయడానికి మరో 108 ఈఎమ్‌ఏఎస్ అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. పాత అత్యవసర వైద్య అంబులెన్స్ సర్వీస్ లేదా ఈఎమ్‌ఏఎస్ ఫ్లీట్‌తో పాటు మిగిలిన కొత్త అంబులెన్స్‌లను త్వరలో అంబులెన్స్ సేవలో మోహరిస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన అంబులెన్సు వాహనాల్లో వాణిజ్య, రవాణా శాఖ అధీనంలో విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లలో ఉపయోగించడానికి 5 ఏఎల్‌ఎస్ అంబులెన్సులను, ఝార్సుగుడ కార్డియాక్ కేర్ హాస్పిటల్ కోసం 2 ఏఎల్‌ఎస్ అంబులెన్స్‌లను ఉపయోగిస్తారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, ఏకామ్రా భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, ఆరోగ్య కమిషనర్, కార్యదర్శి అశ్వతి ఎస్, రాష్ట్ర శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ బృందా, ఆరోగ్య శాఖలోని వివిధ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


