తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
● లేదంటే 26న సీఎస్‌వో కార్యాలయం ముట్టడి
● మాజీ మంత్రి రబినారాయణ నందో డిమాండ్
జయపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ నెల 24వ తేదీలోగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, రాష్ట్ర బిజేడీ ఉపాద్యక్షులు రబినారాయణ నందో కోరారు. లేదంటే ఈ నెల 26వ తేదీన జిల్లా సివిల్ సప్‌లై కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం బీజేడీ నేత బాలారాయ్ కార్యాలయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మండీల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జిల్లాలో గత 11వ తేదీన మండీలు ప్రాంభించిన అధికారులు టీ తాగి వెళ్లిపోయారు తప్పితే నేటి వరకు ఎక్కడా ఒక్క కేజీ ధాన్యం ఖరీదు చేయలేదని దుయ్యబట్టారు. మండీలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయటం అధికారుల నైతిక బాధ్యతన్నారు. అయితే అధికారులు బాధ్యత విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని మండీల్లో వేలాది బస్తాల ధాన్యం పడి ఉన్నాయని వివరించారు. రెండు దినాల కిందట కొరాపుట్ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని తాము కలసి కొరాపుట్ జిల్లా రైతుల సమస్యలతో పాటు మండీలలో పడిఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. మండీలలొ రైతుల ధాన్యం కొంటామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదన్నారు. దీంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో బీజేడీ నేతలు బాలారాయ్, బి.బాలంకిరావు, ఎ.శ్రీనివాసరావు, టున రథో పాల్గొన్నారు.


