జవాన్ ఈశ్వర్ తలియ విగ్రహావిష్కరణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ గుడ గ్రామంలో సహిద్ జవాన్ ఈశ్వర తలియ విగ్రహాన్ని ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన జన్మస్థలం బొడొగుడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాద్ మచ్చ పాల్గొని ఈశ్వర తలియ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ ప్రసంగిస్తూ సహిద్ జవాన్ ఈశ్వర్ దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ అన్నారు. కొరాపుట్ జిల్లా వీరుల, త్యాగధనుల మట్టి అని అన్నారు. బొయిపరిగుడ సమితి తెంతులిగుమ్మ గ్రామంలో పుట్టి ఆంగ్లేయులతో పోరాడి చిరు నవ్వుతో ఉరికంబ మెక్కి ప్రాణ త్యాగం చేసిన ఆదివాసీ నేత సహిద్ లక్ష్మణ నాయిక్ దేశ స్వాతంత్య్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారని, అతడితో పాటు బొయిపరిగుడ సమితికి చెందిన అనేక మంది దేశం కోసం రక్తం చిందించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి దేశ భక్తులు పుట్టిన బొయిపరిగుడ సమితి లోమరో కలికి తురాయి సహిద్ ఈశ్వర తలియ అని ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ పడాల్, మాజీ మంత్రి పద్మిణి దియాన్, మాజీ ఎంపీ జిన్నా హికాక, బొయిపరిగుడ సమితి చైర్మన్ ప్రశాంత గుప్త, జిల్లా పరిషత్ సభ్యులు రాజేష్ మహురియ, మొణ జాని, బొయిపరిగుడ సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ, తహసీల్దార్ స్నిగ్ధ చౌధురి, ఖెందుగుడ పంచాయతీ సర్పంచ్ అభిమణ్య నాయిక్ తో పాటు పలు గ్రామాల ప్రజలు పాల్గొని సహిద్ జవాన్ ఈశ్వర్‌కు ఘనమైన నివాళులు అర్పించారు.


