ఉపాధి పథకం పేరు మార్పుపై ఆందోళన
పర్లాకిమిడి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని (మన్‌రేగా) కేంద్ర సర్కారు పేరు మార్పు చేయనుండడంతో గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆధ్వర్వంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఘెరావ్ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని మెయిన్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. వలస కార్మికులకు ఉపాధి పథకం ద్వారా ఏడాదికి కనీసం వంద రోజుల పనిదినాలు కల్పించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం చేశారన్నారు. దీనిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయనుండడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రస్తారోకో ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే గోమాంగో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి హాయ్, హాయ్ అని నినాదాలు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రాసిన వినతిని గజపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ మిత్తాలి మధుసూదన్ పాడికి అందజేశారు. ఈ ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, కున్నా మఝి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యనారాయణ పాత్రో, సంజయ్ అధికారి, పాపారావు, అనంత గురు, తదితరులు పాల్గోన్నారు.
ఉపాధి పథకం పేరు మార్పుపై ఆందోళన


