హంతకుడిని పట్టించిన వాట్సాప్ కాల్
● కేశవరావుపేట వద్ద మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ ● నిందితుడు సంతపేటకు చెందిన ప్రశాంత్‌గా గుర్తింపు ● వివాహేతర సంబంధమే కారణం
శ్రీకాకుళం క్రైమ్ :
హత్య కేసులో నిందితుడిని వాట్సాప్ కాల్స్ పట్టించాయి. అదే హంతకున్ని పోలీసులు విచారిస్తున్నప్పుడు మరో కీలక కేసుకు క్లూ లభించింది. ఈ నెల 3న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట హైవే వద్ద బయటపడిన మహిళ మృతదేహం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42)ను కేశవరావుపేట వద్ద హత్య చేసి హైవే మీద పడేసింది నరసన్నపేట సంతపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్‌కుమార్ (32)గా పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
రెండేళ్లుగా పరిచయం..
సీతారత్నంకు నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్‌కుమార్‌తో రెండేళ్లక్రితం పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రశాంత్ మొదట్లో పెయింటర్‌గాను తర్వాతి కాలంలో సొంతంగా ఆటో నడుపుకుంటూ ఓ కారు కూడా కొన్నాడు. ఈ నెల 2న ప్రశాంత్‌కు సీతారత్నం కలిసి కారులో సింహద్వారం నుంచి కొత్తరోడ్డువైపు సర్వీసురోడ్డులో వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆగారు. తనకు రూ.50 వేలు కావాలని, ఇవ్వకపోతే తన విషయాన్ని భార్యకు చెప్పేస్తానని సీతారత్నం బెదిరించింది. దీంతో సీతారత్నం వల్ల ఎప్పటికై నా ప్రమాదమేనని భావించి కారును ఎచ్లెర్ల వైపు తీసుకొచ్చి జనసంచారం లేని చోట కారు ఆపాడు. సీతరాత్నం చీర చెంగు, పుస్తెల తాడుతో మెడను బిగించి చంపేశాడు. అదేమార్గంలో రెండు మూడు చోట్ల శవాన్ని పడేద్దామన్నా కుదరకపోవడంతో కింతలి మిల్లు జంక్షన్‌కు వచ్చే సర్వీసురోడ్డు పక్కన శవాన్ని పడేసి, పుస్తెల తాడు, ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు.
వాట్సాప్ కాల్సే పట్టించాయి..
3న మృతదేహం బయటపడటం, పోలీసులు సీతా రత్నం కుటుంబీకుల వాంగ్మూలంతో గుర్తించడం.. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలోని సీఐ ఎం.అవతారం తమ బృందంతో దర్యాప్తు చేపట్టి మృతురాలి వాట్సాప్‌కాల్స్ మాట్లాడిన నంబర్లను గుర్తించారు. హత్య జరిగిన సమయానికి ముందుగా, కొద్ది రోజులుగా ఎక్కువగా మాట్లాడింది ప్రశాంత్ నంబర్ అని తేలడం.. అడ్రస్ నరసన్నపేట అని ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల్లో కారునెంబరును గుర్తించి నిందితుడు ప్రశాంత్‌గా నిర్ధారించారు. ప్రశాంత్ చిన్నతనంలోనే ద్విచక్రవాహనాన్ని దొంగిలించి జువైనల్ హోమ్‌కు వెళ్లాడని ఎస్పీ తెలిపారు.
పట్టుకున్నారిలా..
సీఐ అవతారానికి వచ్చిన సమాచారంతో జర్జాం కూడలిలో దాబా వద్ద కారులో ఉన్న ప్రశాంత్‌ను ఎస్‌ఐ, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. అతని వద్ద రోల్డ్ గోల్డ్ చైను, బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారం, ఎచ్చెర్ల పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


