తీగ లాగితే పిస్టల్ బయటకొచ్చింది!
● సీతారత్నం హత్య కేసు దర్యాప్తులో కీలకమలుపు ● పిస్టల్‌తో సంబంధమున్న ఐదుగురు అరెసు్ట
శ్రీకాకుళం క్రైమ్ : నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42) హత్యకేసు మరో కీలక కేసుకు క్లూ అందించింది. సీతారత్నంను కారులో ఎక్కించుకుని ఎచ్చెర్ల కేశవరావుపేట సమీపంలో ఈ నెల 2న హత్య చేసిన నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్‌కుమార్ వద్ద పిస్టల్ ఉందన్న సమాచారం విచారణ సమయంలో పోలీసులకు తెలిసింది. ఆ పిస్టల్ ఎలా వచ్చింది.. ఎక్కడ దాచావ్ అన్న కోణంలో విచారించగా మరో ఐదుగురు నిందితుల సమాచారం పోలీసులకు చిక్కింది. నిందితులైన పంచిరెడ్డి కై లాస్(బొంతలకోడూరు), అలబాన మణి (గుజరాతీపేట), కలగ ఉమామహేశ్వరరావు (పెద్దపాడు), పూర్ణాన ప్రశాంత్‌కుమార్ (కోటబొమ్మాళి మండలం నారాయణవలస), దండాసి కార్తీక్ (ఎల్ బీఎస్ కాలనీ, శ్రీకాకుళం)లను అరెస్టు చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
ప్రశాంత్‌ను విచారిస్తున్నప్పుడే..
సీతారత్నం హత్య కేసులో ప్రశాంత్‌ను డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంలు విచారణ చేస్తున్నపుడు పిస్టల్ ఉందన్న సమాచారం తెలియడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమేనని, ఆ పిస్టల్ నగరంలోని ఎల్‌బీఎస్‌కాలనీకి చెందిన దండాసి కార్తీక్‌కు రూ. 17 వేలకు అమ్మినట్లు చెప్పాడు. ఇదే విషయం ఎస్పీకి తెలియడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయమని డీఎస్పీకి ఆదేశించారు. కార్తీక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో తనతో పాటు మరికొందరున్నారని చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫరీద్‌పేటలో టీడీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన సత్తారు గోపి రెండేళ్లక్రితం బొంతలకోడూరుకు చెందిన పంచిరెడ్డి కై లాస్‌తో కలసి నేరాలు చేసేందుకు ఒడిశా రాష్ట్రం బరంపురంలో సంతోష్ అనే వ్యక్తి వద్దరూ.90 వేలు పెట్టి పిస్టల్‌ను, 3 రౌండ్లను కొనుగోలు చేశాడని నిర్ధారించారు. అదే పిస్టల్‌ను పంచిరెడ్డి కై లాస్ వద్ద తాజా హత్యకేసులో నిందితుడైన గొల్లపల్లి ప్రశాంత్‌కుమార్ కొంతమొత్తానికి కొన్నట్లు చెప్పారు. తర్వాత కార్తీక్‌కు రూ.17 వేలకు అమ్మిన సంగతి తెలిసిందే.
పిస్టల్ మళ్లీ అడగడంతో..
కార్తీక్ వద్ద ఉన్న పిస్టల్‌ను పంచిరెడ్డి కై లాస్, మణి, ఉమామహేశ్వరరావు, పూర్ణాన ప్రశాంత్‌కుమార్‌లు మళ్లీ అడగడంతో తండేవలస ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో పిస్ట్‌ల్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని, అదే సమయంలో రూరల్ ఎస్‌ఐ రాము తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నారన్నారు. అసలు ఆ పిస్టల్ ఎందుకు కొన్నారు.. ఏ నేరం చేయడానికి కొన్నారు.. ఎవరు ఆర్థిక సహాయం చేశారన్నదానిపై దర్యాప్తు చేసి పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐ, ఇతర బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
పిస్టల్, మూడు రౌండ్ల మాక్టిన్


