రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
జయపురం: జయపురంలో అమాయకులను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన కాటుగాళ్లు మరో ఇద్దరినీ మోసం చేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. జయపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గొడియదొబాసాహిలోకి చెందిన దేబాశిష్ నాయిక్‌కు ఈనెల 16 తేదీన ఒక కాల్ వచ్చింది. తాము బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి, తాము వాట్సాప్‌కు పంపించిన ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాలని సూచించారు. దీంతో అతడు డౌన్‌లోడ్ చేశాడు. అనంతరం అనుమానం వచ్చి తర్వాత రోజు తన బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేయగా, అతడి అకౌంట్ నుంచి రూ.99,970లు మాయమయ్యాయి. వెంటనే అతడు 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
బహుమతి పేరుతో బోల్తా
పట్టణానికి చెందిన బీకే పాత్రో సైతం సైబర్ ఉచ్చులో చిక్కుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతడికి గత నెల 30వ తేదీన ఒక కాల్ వచ్చింది. అకౌంట్ బాగా నిర్వహిస్తున్న కారణంగా బ్యాంక్ నుంచి రూ.40 వేలు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.7,139లు చెల్లించాలని తెలిపారు. అలాగే కొన్ని రోజుల తర్వాత అతడికి మరో ఫోను వచ్చింది. తన బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ ఫోటో తీసి పంపమని చెప్పారు. అతడు అలాగే చేయడంతో అకౌంట్ నుంచి రూ.7,139లు కట్ అయ్యాయి. మరలా 2027 తర్వాత డబ్బు కట్ చేస్తామని మెసేజ్ వచ్చింది. తనకు ఏ డబ్బు రాకుండా ఎందుకు తన ఖాతా నుంచి డబ్బులు కట్ చేస్తున్నారనే అనుమానంతో జయపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


