రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రాయగడ: చందిలి పోలీస్‌స్టేషన్ పరిధి డొంగరపడ నాగావళి వంతెనపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. మృతుడు సదరు సమితి అలుబడి పంచాయతీలోని సనొకొసపాడు గ్రామానికి చెందిన అజిత్ జిలకర (17)గా గుర్తించారు. అదేవిధంగా గాయాలు తగిలిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన జితు జిలకరగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనొకొసబడి గ్రామానికి చెందిన జితు, అజిత్‌లు కొత్త దుస్తులు కొనేందుకు ఒక ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వీరు డొంగరపడ నాగావళి నది బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి జేకేపూర్ నుంచి పేపర్ లోడ్‌తో రాయిపూర్ వైపు వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైకు డ్రైవింగ్ చేస్తున్న అజిత్ జిలకర లారీ చక్రం కింద పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైకు వెనుక కూర్చున్న జితు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


