ఏడుగురు విద్యార్థులు సస్పెండ్
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల ప్రాంతంలో ఉన్న నవోదయ విద్యాలయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యాలయంలో శనివారం ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 11వ తరగతి విద్యార్థులు ఘర్షణ చేసిన విద్యార్థులను పిలిచి కొట్టారు. వారికి కేర్ టేకర్ విశ్వజీత్ సర్కార్ సహకరించి మరింతగా కొట్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్ రాము రాచాకు తెలియడంతో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించారు. దీనిలో భాగంగా విద్యార్థులను కొట్టిన ఏడుగురు 11వ తరగతి విద్యార్థులను సస్పెండ్ చేశారు. అలాగే కేర్ టేకర్ విశ్వజీత్‌ను విధుల నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలియజేశారు.


