పాత్రికేయుల సేవలు అపారం
రాయగడ: విధినిర్వహణలో పాత్రికేయుల పాత్ర కీలకమని.. సమాజ శ్రేయస్సుకు వారు చేస్తున్న సేవలు అపారమని ప్రియఖబర్ ఒడియా దినపత్రిక సంపాదకులు రాజ్‌కిశోర్ దాస్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్‌లో శుక్రవారం రాష్ట్ర పాత్రికేయుల సంఘం వార్షికోత్సవసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాత్రికేయులు గ్రామీణ ప్రాంత సమస్యలపై దృష్టిసారించాలని అన్నారు. అధికారులకు, ప్రజలకు వారధులుగా నిలిచి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ఇదిలాఉండగా పాత్రికేయుల సమస్యలను పరిష్కరించే విధంగా సంఘాలు ప్రభుత్వంతో పోరాడుతుండటం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమార్ధం కృషి చేయాలని అన్నారు. స్థానిక న్యాయవాది ప్రదీప్ కుమార్ దాస్ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. పత్రికలకు స్వేచ్ఛకలిగిన నాడే సమాజం మెరుగుపడుతోందని అభిప్రాయపడ్డారు. సమాజ శ్రేయస్సుకు పత్రికలు, పాత్రికేయులు చేస్తున్న సేవలు చాలా విలువైనవని అన్నారు. సంఘం రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు హరిహర దాస్, సురేష్ కుమార్ దాస్ తదితరులు పత్రికలు, పాత్రికేయుల గురించి కొనియాడారు. అనంతరం విశేష సేవలందించిన కొంతమంది పాత్రికేయులను సత్కరించారు.
పాత్రికేయుల సేవలు అపారం


