లోయలో పడిన లారీ
రాయగడ: సదరు సమితి పాత్రపూర్ సమీపంలో ఆంధ్ర నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి సమీపంలోని లోయలో పడిపొయింది. రాయిపూర్‌కు వెళుతున్న లారీ బుధవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురవ్వగా.. డ్రైవర్ కాశ్యాప రాజు గాయాలపాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డైవర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరశురాముడి విగ్రహం ధ్వంసం
రాయగడ: పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న దుర్గాపాడు వద్ద జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన భగవాన్ పరశురాం విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను వేరుచేసి, వివిధ భాగాలను ధ్వంసం చేశారు. అందమైన జలపాతం, చుట్టుపక్కల పచ్చని చెట్లు, అహ్లాదకమైన వాతావరణం ఈ ప్రాంతానికి సొంతం. ప్రతీ ఏడాది డిసెంబర్‌లో సుదూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి పిక్నిక్‌లు చేసుకుని సమయాన్ని గడుపుతుంటారు. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో పరశురాం విగ్రహాన్ని జలపాతంకు సమీపంలో ఏర్పాటు చేసింది. అయితే దుండగుల పైశాచికత్వానికి విగ్రహం ధ్వంసం కావడంతో పరిసర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు వేయాలని ప్రజల డిమాండ్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో అయోధ్య నగర్‌కు రోడ్డు వేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. అయోధ్య నగర వాసులు బిష్ణు నాయిక్, ప్రకాశ్ చంధ్ర మిశ్ర, ప్రతాప్ సాహు, టునా నాయిక్, ప్రపుల్ల స్వై, పాత్రికేయుడు కె.సికిల్ దొర తదితరులు బొరిగుమ్మ బీడీఓ సుకాంత కుమార్ పట్నాయిక్‌ను కలసి మెమొరాండం సమర్పించారు. సమితి అధికారులు కొన్ని వీధులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటికి రోడ్లు లేవని మెమొరాండంలో వెల్లడించారు. దుల్లుగుడ రోడ్డు సమీపంలో గల అయోధ్య నగర్ –3 నంబరు వీధికి రోడ్డు లేదని వారు తెలిపారు. అయోధ్య నగర్‌కు పక్కనే లక్ష్మీవిహార్ సాహి ఏర్పడిందని, ఆ రెండు వీధులకు రోడ్లు లేక పోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు బీడీఓకు సమర్పించిన మెమొరాండంలో వివరించారు. వర్షాకాలంలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే స్పందించి సిమెంటు రోడ్డు వేయాలని కోరారు.
బాత్‌రూమ్‌లో పడి ఐదో తరగతి విద్యార్థిని మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి బియల్పూర్ గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ధరిత్రీ ఖెముడు (10) అనే విద్యార్థిని గురువారం ఉదయం బడిలోని బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడ పడిపోయింది. చాలాసేపటి వరకు బాలిక రాకపోవడంతో టీచర్ విద్యార్థులను పంపగా.. బాలిక పడిపోయిన విషయాన్ని వారు చెప్పారు. దీంతో వెంటనే బాలికను పాండ్రీపాణి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడి వైద్యులు మల్కన్‌గిరి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు తరలిస్తుండగా దారిలోనే బాలిక చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలీదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కన్‌గిరి ఆదర్శ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కారణాలు తెలుస్తాయని ఐఐసీ రీగన్ కీండో తెలిపారు.
లోయలో పడిన లారీ
లోయలో పడిన లారీ
లోయలో పడిన లారీ


