రైతుల కష్టం బూడిద
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కుములి గ్రామ పంచాయతీ పొరజపాత్రోపుట్ గ్రామంలో బుధవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు రైతులకు చెందిన వరిధాన్యం కుప్పలు కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరిపంటను కోసి కళ్లంలో కుప్పలు వేసి ఉండగా అగ్నిప్రమాదం సంభవించింది. సమీపంలో ఉన్నవారు మంటలను చూసి ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితంలేక పోవటంతో బొరిగుమ్మ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి కారణం తెలియలేదు. కాగా అప్పులు చేసి వరిని పండించామని.. కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ప్రకాశ బిశాయి, శ్యామ బిశాయి, కన్హూ బివాయిలు కన్నీరుమున్నీరుగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


