వలస కార్మికులకు తప్పని పాట్లు
రాయగడ : జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపొవడంతో పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు పనులకని వెళుతున్న వలస కార్మికులకు పాట్లు తప్పడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన ఎంతో మంది యువతీ, యువకులు ఆయా ప్రాంతాలకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తున్న సంఘటనలు కోకొల్లలు. జిల్లా యంత్రాంగం గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఈ సమస్యపై మౌనం వహిస్తుండటంతో ఉపాధి కోసం అని వెళ్లిన యువత ఉసూరుమంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కాసీపూర్‌కు చెందిన బిటు మాఝి, దయితారి మాఝి, బిభీషన్ మాఝి, కొబి మాఝి, రాజు మాఝి, బులు మాఝి, మోహన్ మాఝి, సామ్రాట్ మాఝి, బ్రజ మాఝిలు గత కొద్ది రొజుల కిందట తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లో ఒక ప్రయివేట్ కంపెనీలో పనులకని వెళ్లారు. ప్రతి నెల రూ.25 వేల జీతంతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని ముందుగా ఆశ చూపిన కంపెనీ యాజమాన్యం వారు పనుల్లోకి చేరిన తర్వాత వారిని పట్టించుకోవడం మరిచింది. నెలలు గడుస్తున్నా ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన జీతాలు యాజమాన్యం ఇవ్వకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంటికి తిరిగి వచ్చేందుకు అవసరమైన డబ్బులు కూడా చేతిలో లేకపోవడంతో అక్కడే నరకయాతన చూస్తున్నామని ఒక వీడియోను తమ బంధువులకు పంపించారు. వారి పరిస్థితిని గమనించిన కుటుంబీకులు, బంధువులు వారు పంపించిన వీడియోను జిల్లా శ్రామిక విభాగాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని తిరిగి ఆ ఉచ్చు నుంచి బయట పడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గల ఆ కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు చేసి వారిని స్వగ్రామాలకు తరలించాలని వివరించారు.


