జనవరి 18 నుంచి గజపతి ఉత్సవాలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి గజపతి ఉత్సవాలు జనవరి 18 నుంచి 22 వరకూ జరుగుతాయని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ గజపతి ఉత్సవాల ప్రిపరేషన్ మీటింగులో ప్రకటించారు. అలాగే పల్లెశ్రీ ఉత్సవాలు కూడా అదే రోజు నుంచి ఐదు రోజులు గజపతి స్టేడియంలో జరుగుతాయని ఓర్మాస్ అధికారులు తెలియజేశారు. అంతకు ముందు రెండు సార్లు గజపతి ఉత్సవాల సన్నాహాక సమావేశాలు జమ, ఖర్చులు సరిగా కమిటీకి తెలియజేయనందున సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసి వాయిదాలు వేశారు. గురువారం సాయంత్రం యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్ర హాలులో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్‌కలెక్టర్ అనుప్ పండా తదితరులు విచ్చేశారు. జనవరి తొలివారంలో కృషి యంత్రమేళా, సంక్రాంతి పండుగ సందర్భంగా గజపతి ఉత్సవాలు జనవరి 18 నుంచి 22 వరకూ నిర్వహించడమే సముచితం అని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. దీనికి సభ్యులంతా ఏకీభవించారు. అనంతరం ఐదురోజుల ఉత్సవాలకు స్టేజ్‌కమిటీ, స్టాల్స్, ఫుడ్, సాంస్కృతిక, సావనీర్, వంటి వివిధ కమిటీల సభ్యుల నియామకం జరిగింది. సమావేశాలకు ప్రెస్, సీనియర్ సలహాదారు పూర్ణచంద్ర మహాపాత్రో, వివిధ సాంస్కృతిక కమిటీల సభ్యులు హాజరయ్యారు. జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ సమావేశాన్ని సజావుగా జరిపారు.


