కుటుంబం ఆత్మహత్యాయత్నం!
ఇంటిపైనుంచి ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని..
జయపురం:
తమ ఇంటిపై నుంచి వేసిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్షయ పీడిత మహిళ, ఆమె తల్లి టాటా పవర్ ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్‌ను హెచ్చరించారు. ఈ మేరకు జయపురం బమునిగాం గ్రామంలోని టాటా పవర్ ఇంజినీరు కార్యాలయం వద్ద వారు ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జయపురం మునిసిపాలిటీ ఒకటో వార్డు వాసి సంజుక్త సాహు ఇంటిపై నుంచి 33 కేవీ విద్యుత్‌లైన్ ఉంది. ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ ఉండడంతో పలుమార్లు విద్యుత్ షాక్‌కు గురవుతున్నామని.. అలాగే ఏ క్షణంలో ఏది జరుగుతుందోననే భయంతో ఉన్నామంటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇంటిలో క్షయవ్యాధి పీడిత మహిళ సంజుక్త సాహుతో పాటు దివ్యాంగురాలైన ఆమె తల్లి నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఆ లైన్‌తో పాటు విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించాలని సంజుక్త సాహు కుటుంబ సభ్యులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అందుచేతనే తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. విద్యుత్ లైన్లను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, విద్యుత్ విభాగ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేక పోయిందని వాపోయారు. అందుచేత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు వెల్లడించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి మోహణ మఝి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారన్నారు. విద్యుత్ లైన్, స్తంభాన్ని తొలగించేందకు రూ. 1.20 లక్షలు చెల్లించాలని విద్యుత్ విభాగం లేఖ ద్వారా తెలిపిందని.. వెంటనే తాము జిల్లా కలెక్టర్‌ను కలిసి లేఖ చూపామని వెల్లడించారు. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని.. కేవలం రూ. 30 వేలు మాత్రం సహాయం అందించగలమని కలెక్టర్ తెలిపారన్నారు. తాను క్షయ పీడిత రోగినని.. అంత డబ్బు మా వద్ద లేకపోవడంతో ఆత్మహ్యత్య చేసుకోవాలని నిర్ణయించామని సంజుక్త సాహు వాపోయారు.
కుటుంబం ఆత్మహత్యాయత్నం!


