టీ కొట్టులోనే రాజకీయాలకు పునాది
జయపురం: చాలా మంది రాజకీయ నేతలు టీ కొట్టు వద్ద రాజకీయాలు మాట్లాడుతూ ఎదిగారని రాష్ట్ర గణవిద్యామంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. ఆయన భువనేశ్వర్ నుంచి నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్‌కు వెళ్తూ జయపురంలో కొంత సమయం ఆగగా బీజేపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. బీజేపీ కార్యకర్తలు, ఆయన జయపురం మెయిన్ రోడ్డులో గల పురాతన సూర్య హొటల్‌కు వచ్చి పెసరట్టు టిఫిన్ చేసి టీ తాగారు. మంత్రి వచ్చారన్న విషయం తెలుసుకుని స్థానికులు హొటల్ చుట్టూ చేరి ఆయనతో ముచ్చటించారు. మంత్రి వారి కష్ట సుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తనకెంతో ఆనందంగా ఉందని, మిత్రులతో టీ తాగేందుకు వచ్చిన తనకు అనేక మందిని కలిసే అదృష్టం కలిగిందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టీ దుకాణాలే మంచి వేదికలని తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులు నరశింగ చౌదురి, (సన చౌదురి)రబి నాయిక్, ఎ.వెంకట రావు, కమల భొత్ర, మనోజ్ కుమార్ దాస్, రుణ మహాపాత్రోలతో పాటు, జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎస్.మనోజ్ బాను రావు, సురభి పాణి, మధు హియాల్, పి.కనకా రావు, బాపి పొరిడ, పలువురు స్థానికులతో ఆయన చర్చించారు.


