భార్య హత్య కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే

- - Sakshi

భువనేశ్వర్‌: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేని దోషిగా స్థానిక కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ల క్రితం గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో భార్య అనుమానస్పద మృతి కేసు విచారణలో హత్యగా తేలింది. ఈ కేసు విచారణ జరిపిన స్థానిక కోర్టు మాజీ ఎమ్మెల్యేనే ఈ కేసులో దోషిగా ప్రకటించింది. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాల ఆధారంగా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

శిక్ష వివరాలను మంగళవారం ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని భార్య సగం కాలిన మృతదేహాన్ని 1995 సంవత్సరంలో స్థానిక ఖారవేళ నగర్‌లో ఎమ్మెల్యే నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి ఆమె గర్భవతి అని గుర్తించారు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు.

గొమాంగో రాజకీయ ప్రస్థానం
1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్‌ టికెట్‌పై రామమూర్తి గొమాంగో ఎన్నికయ్యారు. అనంతరం 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్‌ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మరలా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అతను తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్‌, భారతీయ జనతా పార్టీ కూటమి విడిపోవడంతో బీజేపీ నుంచి దూరమయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన తిరిగి మరలా బీజేపీలో చేరారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top