న్యూఢిల్లీ: భార్యను హత్యచేసి, ఏమి తెలియనట్టు ఆత్మహత్యగా చిత్రీకరించాడో వ్యక్తి. నకిటీ సూసైడ్ నోట్ డ్రామా ఆడాడు. కానీ నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టం చేతికి చిక్కక తప్పదు. అలా 15 ఏళ్ల తరువాత అసలు గుట్టు రట్టు చేశారు పోలీసులు.
15 సంవత్సరాల నాటి క్రిమినల్ కేసును ఛేదించారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో భార్యను హత్య చేసినగుజరాత్‌కు చెందిన నరోత్తం ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా మంగళవారం ఢిల్లీ పోలీసు బృందం వడోదరలోని చోటా ఉదయపూర్ ప్రాంతంలో ప్రసాద్‌ను అరెస్టు చేసింది. అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
2010 నాటి కేసు
2010 మే 31 ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇంటి తలుపు తెరిచినప్పుడు, 25 ఏళ్ల మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పక్కనే ఒక సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే భర్త పరారీలో ఉండటంతో అనుమానాలు వ్యక్తమైనాయి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రసాద్ (బాధితురాలి భర్త) పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ఆచూకీ తెలిపినవారికి రూ. 10,000 రివార్డు ప్రకటించారు.
2025లో ఛేదించారు ఇలా..
ప్రసాద్ రాజస్థాన్‌లోని సికార్ నివాసి. భార్యను హత్య చేసిన తరువాత అక్కడినుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. చోటా ఉదయపూర్‌లోని ఒక కాటన్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే అప్పటినుంచి అతనికోసం గాలిస్తున్న పోలీసులు, పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం విచారణలో నిందితుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. వివాహమైన కొన్నాళ్లకే తమ మధ్య గొడవలు పెరిగాయని తెలిపాడు. ఆ కోపంతో భార్యను హత్య చేసి, పోలీసులను తప్పుదారి పట్టించడానికి నకిలీ సూసైడ్ నోట్ రాశానని కూడా నిందితుడు ఒప్పుకున్నాడు.


