● ఉత్సాహంగా ముహూర్తపు రాట ప్రక్రియ
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం నాడు ముహూర్తపు రాట వేశారు. ఆలయ అర్చకులు చంద్రశేఖర్ బెరుకో, రాజపురోహితులు బీరంచి దాస్‌లు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మందిరం ప్రాంగణంలో మూహూర్తపు రాట వద్ద సంప్రదాయ బద్ధంగా పూజలను చేశారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలు మార్చి 31వ తేదీతో ముగుస్తాయని అమ్మవారి మందిర మేనేజింగ్ ట్రస్టీ రాయిసింగి బిడిక తెలిపారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం స్థానిక జంఝావతి నది వద్ద గంగమ్మ తల్లికి పూజలను నిర్వహించిన అనంతరం పవిత్ర గంగాజలాలను తీసుకువచ్చి అమ్మవారి మందిరంలో నిలపడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. మూహూర్తపు రాట కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాసరావు, దేవేంద్ర బెహర, రాధాక్రిష్ణ దలాయి, పెద్దిన వాసు, మంగరాజు హుయిక, మందిర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులు విడుదల చేశారు.


