విద్యావేత్తలు దేశ భవిష్యత్‌ రూపకర్తలు: గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యావేత్తలు దేశ భవిష్యత్‌ రూపకర్తలు: గవర్నర్‌

Mar 14 2026 8:01 AM | Updated on Mar 14 2026 8:01 AM

భువనేశ్వర్‌: దేశ భవిష్యత్‌ను రూపొందించడంలో విద్యావేత్తల పాత్ర అత్యంత కీలకం. ప్రధానంగా ఉపాధ్యాయుల పాత్ర పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి తెలిపారు. భారతీయ సంప్రదాయానికి వన్నె దిద్దిన గురు–శిష్య సంబంధం విద్య అభ్యాసంతో పాటు జ్ఞానం, విలువలు, వ్యక్తిత్వం పెంపుదలకు మూల ఆధారంగా పేర్కొన్నారు. స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐలీ) సెనేట్‌ హాల్‌లో శుక్రవారం ఉపాధ్యాయుల కోసం జాతీయ వృత్తిపరమైన ప్రమాణాలు, జాతీయ మార్గదర్శకత్వం విధానాలు దేశ వ్యాప్తంగా అమలు కోసం సామర్థ్య నిర్మాణంపై 2 రోజుల సమావేశాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు (ఎన్‌పీఎస్‌టీ), జాతీయ మెంటరింగ్‌ మిషన్‌ (ఎన్‌ఎమ్‌ఎం) దేశ వ్యాప్తంగా అమలు కోసం అనుబంధ వర్గాల్లో సామర్థ్య దృఢీకరణపై నిపుణులు అనుభవాలు, దక్షతని పంచుకున్నారు. ఉపాధ్యాయులకు సాధికారత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఐఐటీ డైరెక్టరు శ్రీపాద కర్మల్కర్‌, ఎన్‌సీటీఈ చైర్‌పర్సన్‌ పంకజ్‌ అరోరా మీడియాకు వివరించారు. సమష్టి ప్రయత్నాలతో బోధనా వృత్తిని బలోపేతం చేసి విద్యావేత్తలను శక్తివంతం చేయాలన్నారు. ప్రతి తరగతి గది సరికొత్త ఆవిష్కరణల కలల వేదికగా ఎదగాలని గవర్నరు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితులు మన తరగతి గదుల నాణ్యత, శ్రామిక శక్తి నాణ్యతను, ప్రజాస్వామ్య బలం, మన సామాజిక స్వభావానికి కొలమానంగా నిలుస్తాయన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, జార్ఖండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాల నుంచి విద్యావేత్తలు, నిర్వాహకులు, విధాన రూపకర్తలు ఈ సమావేశంలో ఒక వేదికపై సమావేశమై జాతీయ విద్యా విధానం ఫలప్రదమైన అమలు, కార్యాచరణ కోసం చర్చించడం అభినందనీయమని గవర్నరు నిర్వాహకులను అభినందించారు. పాఠశాల విద్య, ఎస్‌ సీఈఆర్‌ టీ డైరెక్టర్లు, డీఐఈటీల ప్రాచార్యులు, నోడల్‌ అధికారులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ పాఠశాలలు, రాష్ట్ర బోర్డు సంస్థల ప్రాచార్యులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల కోసం వృత్తిపరమైన ప్రమాణాలు, కెరీర్‌ మార్గాల ఇతివృత్తంతో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) అభివృద్ధి చేసిన ఎన్‌పీసీటీపై అనుభవజ్ఞులైన నిపుణులు ప్రసంగించారు. ఈ సందర్భంగాఎన్‌సీటీఈ విద్యా సలహాదారు డి. కె. చతుర్వేది, ఐఐటీ భువనేశ్వర్‌ డీన్‌ (నిరంతర విద్య) వి. పాండు రంగా, ఐఐటీ భువనేశ్వర్‌ సమన్వయకర్త వేణుగోపాల్‌ అరుమురు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement