పర్లాకిమిడి: గంజాయి స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంబల్‌పూర్ గ్రామ పంచాయతీ సురుబెడా ఏజెన్సీలో గంజాయి దాచారన్న పక్కా సమాచారంతో, ఐఐసీ తన సిబ్బందితో దాడులు చేసి మూడిళ్లలో 455 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు జోహాన్ గోమాంగో, సాధుచరణ్ గోమంగో, ఇసో మండళ్‌లు పోలీసులు గ్రామానికి వచ్చినప్పుడు తప్పించుకుని పారిపోయారని ఆర్.ఉదయగిరి ఐఐసి ఆశిష్‌కుమార్ ఖండువాల్ తెలిపారు. నువాగడ అదనపు తహసీల్దార్ సాహు గంజాయి బస్తాలను తూకంగా వేయగా 455 కిలోలుగా నిర్ధారించారు. పట్టుకున్న గంజాయిని ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్‌లో గంజాయితో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారి నుంచి 15 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. అరెస్టయిన నిందితులు కంధమాల్ జిల్లాకు చెందిన కొట్నాగర్ ప్రాంతంలో గల భాజారాం భలియార్ సింగ్, రాయగడ జిల్లా మునిగుడకు చెందిన అక్ష్మణ్ బాగ్‌లుగా గుర్తించారు. ఎప్పటిలాగే రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. దీంతో బ్యాగులో గంజాయి పట్టుబడింది.


