రాయగడ: గుర్తు తెలియని ఐదుగురు దుండగులు ఒక ఇంట్లోకి చొరబడి, ఇంట్లో పడుకున్న వ్యక్తిని తుపాకీతో బెదిరించి విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని ఫైర్‌స్టేషన్ ఎదుట నివసిస్తున్న బసంత కుమార్ మిశ్రో అనే వ్యక్తి ఇంట్లోకి శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని ఐదుగురు దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న మిశ్రోను లేపి తుపాకీతో బెదిరించారు. ఇంట్లో వస్తువులు, నగదు ఇమ్మని భయపెట్టారు. అందుకు ససేమిరా అనడంతో అతనిపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోని ఫ్రిజ్, బంగారు ఆభరణాలు, వాషింగ్ మెషిన్, గ్యాస్ సిలిండర్, ద్విచక్ర వాహనంతో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు. దుండగులు వెళ్లిన అనంతరం మిశ్రో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న మిశ్రోను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు బాధితుని ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


