వివాహితతో చనువుగా... యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహితతో చనువుగా... యువకుడు మృతి

Jun 11 2023 9:32 AM | Updated on Jun 11 2023 9:34 AM

- - Sakshi

నరసన్నపేట: మడపాం పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన తోట కృష్ణ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన మృతదేహం మేజరు పంచాయతీ నరసన్నపేట మారుతీనగర్‌–1లోని సాయి మందిరం వద్ద పోలీసులు గుర్తించారు. కృష్ణ మృతికి స్పష్టమైన కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎవరో మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోను లభించచడంతో దాని ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు. కొత్తపేటకు చెందిన తోట కృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి సాయమ్మలు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనే తమ కుమారుడు కృష్ణను హత్య చేసి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా కృష్ణ నరసన్నపేట మారుతీనగర్‌ ప్రాంతానికి చెందిన వివాహితతో చనువుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

కృష్ణ శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. రాత్రికి రాలేదని, ఉదయానికే పోలీసులు ఫోను చేస్తే తెలిసిందని మృతుని తండ్రి లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. కృష్ణ గతంలో ఆటో నడిపే వాడ ని.. ప్రస్తుతం టోల్‌గేట్‌లో పని చేస్తున్నట్లు చెప్పారు. 2017లో ఈదులవలసకు చెందిన హారికతో కృష్ణకు వివాహమైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వారం క్రితమే సీమంతం చేశారు. కాగా వివాహిత ఇంటి వెనుక భాగంలో మృతదేహం లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మేడ పైనుంచి దూకడం వల్ల మృతి చెందాడా.. లేదా వివాహిత ఇంట్లో వాళ్లు ఏదో చేసి కిందకు పడేశారా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలచంద్రరెడ్డి, సీఐ డి.రాములు పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement