అఖిలేష్‌ సోదరుడి మృతిపై మరిన్ని అనుమానాలు | Uttar Pradesh Prateek Yadav Death Sparks Political Storm As Postmortem Report Reveals Shocking Injury Details | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌ సోదరుడి మృతిపై మరిన్ని అనుమానాలు

May 14 2026 10:43 AM | Updated on May 14 2026 10:53 AM

Sensation Autopsy Report in UP Prateek Yadav Case

ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫిట్‌నెస్‌ గురుగా పేరున్న ప్రతీక్‌ కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆరోగ్యం క్షీణించి చనిపోవడం అనుమానాలకు తావివ్వగా.. ఇప్పుడు ఆటాప్సీ నివేదిక సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో ఏ ట్విస్టులు బయటపడతాయో అనే ఉత్కంఠ నెలకొంది.

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌ ప్రతీక్‌ యాదవ్‌ మృతిపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ‘‘మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం’’తో మరణించారని ప్రకటించింది. అంటే.. ఊపిరితిత్తుల్లో రక్తం పెద్దగా గడ్డ కట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోవడం. దీనినే కార్డియోరెస్పిరేటరీ కొల్పాప్స్‌ అంటారు. ఈ స్థితిలో శ్వాస, గుండె పనితీరు రెండూ అకస్మాత్తుగా ఆగిపోతాయి.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం..  మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ప్రతీక్ యాదవ్ మరణానికి ప్రధాన కారణం. ఆయనకు ఇదివరకే లంగ్స్‌, లివర్‌ సమస్యలున్నాయ్‌. గతంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు కూడా. కానీ, ఇప్పుడు ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు ప్రకటించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

శవపరీక్షలో ఆయన శరీరంపై మొత్తం ఆరు గాయాలు గుర్తించారు. వీటిలో మూడు గాయాలు.. వారం కిందటే అయ్యాయి. మిగతా మూడు చనిపోవడానికి ఒక్కరోజు ముందు వచ్చాయి. ఛాతి భాగంతో పాటు మోచేయి, కుడి చేయి, మణికట్టు, మోచేతి వద్ద ఈ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. 

రాజకీయ దుమారం!
ప్రతీక్‌ యాదవ్‌ కుటుంబ నేపథ్యం కూడా ఈ మరణానికి రాజకీయ రంగు అద్దింది. ఆయన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి. ములాయం సూచన మేరకు ప్రతీక్‌ రాజకీయాలకు మొదటి నుంచి దూరంగా ఉన్నారు. రియల్‌ఎస్టేట్‌, జిమ్‌ సెంటర్లు.. తన వ్యాపారాలేవో చేసుకుంటున్నాడు. సవతి సోదరుడు కావడంతో ఇటు అఖిలేష్‌ యాదవ్‌తోనూ ఎక్కడా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం లేదు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండేవని ఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అనారోగ్యంతో ప్రతీక్‌ ఆస్పత్రి పాలైనప్పుడు అఖిలేష్‌ వెళ్లి పరామర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ క్రమంలో..

ప్రతీక్‌ యాదవ్‌ వ్యక్తిగత జీవితం తెర మీదకు వచ్చింది. ప్రతీక్‌ భార్య అపర్ణా యాదవ్‌ 2022లో బీజేపీలో చేరారు. ఆ సమయంలో భార్యాభర్తలకు గొడవ జరిగినట్లు కథనాలు వచ్చాయి. తన కుటుంబానిది ఎస్పీ నేపథ్యం కావడంతో ఆ చేరికను ప్రతీక్‌ విబేధించారని.. అయినా ఆమె మొండిగా ముందుకు వెళ్లారని ఆ కథనాల సారాంశం. ఈ క్రమంలో..

ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని ప్రతీక్‌ ప్రకటించారు. అయితే కొన్నిరోజులకే ఆయన మనసు మార్చుకున్నాడు. ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ కనబరిచే ప్రతీక్‌కు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం ఎందుకనో క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడం.. ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే చనిపోయారని ప్రకటించడం జరిగిపోయాయి. ప్రతీక్‌ యాదవ్‌ మృతిపై అనుమానాల నేపథ్యంలో.. ఆయన అంతర్గత అవయవాలను పరీక్షలకు పంపారు. ఇటు రాజకీయ వర్గాల్లో ఈ మరణం చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణంపై యోగి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. డీసీపీ సెంట్రల్‌ విక్రాంత్‌ వీర్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారిస్తోంది. పోలీసులు ఇప్పటికే లక్నోలోని ప్రతీక్‌ యాదవ్‌ నివాసాన్ని సీజ్ చేసి, మొబైల్, ల్యాప్‌టాప్, డైరీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నేతలు కూడా ఈ ఘటనపై విచారణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీక్ మరణం సాధారణం కాదు, జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement