నాగర్‌కర్నూల్ జిల్లా: భర్త, కుమారుడితో కలిసి ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఓ మహిళను రోడ్డుపై ఉన్న గుంత బలి తీసుకుంది. ఈ హృదయ విషాధకర ఘటన బల్మూర్ మండలంలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిలోని తుమ్మెన్‌పేట కాజ్‌వే వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని తుమ్మెన్‌పేట గ్రామానికి చెందిన మద్దెలగండ్ల దివ్య (20), భర్త హరికృష్ణతో పాటు ఆరు నెలల కుమారుడితో కలిసి బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్చంపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో మార్గ మధ్యలోని తుమ్మెన్‌పేట స్టేజీ సమీపంలో ఉన్న కాజ్‌వే వద్ద ఎదురుగా వస్తున్న బస్సు లైట్ల ఫోకస్‌కు రోడ్డుపై ఉన్న గుంతలోకి బైక్ దించడంతో వెనకాల కుమారుడిని పట్టుకొని కూర్చున్న దివ్వ పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కాగా.. సృహ తప్పిపోవడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి చింతల సురేష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ తెలిపారు.


