ఇక పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

ఇక పరిషత్‌ పోరు

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

నేడు 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

992 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 55 మంది అభ్యర్థులు 276 ఎంపీటీసీ స్థానాలకు 631 పోటీ

నేడు 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నూతనంగా ఏర్పాటైన ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 16 జెడ్పీటీసీ, 280 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 8,35,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 276 ఎంపీటీసీ స్థానాలకు 631 మంది పోటీ పడుతున్నారు. 280 స్థానాలకు గాను 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 276 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు మొత్తం 16 మండలాల్లో 992 మంది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వాహణకు 1151 మంది పీవోలు, 1,151 మంది ఏపీవోలు, 3842 మంది ఓపీవోలు విధుల్లో పాల్గొంటున్నారు.

ప్రధాన పార్టీల మధ్య పోటీ..

జిల్లాలో వైఎస్సార్‌ సీపీ 16 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కూటమిలోని టీడీపీ 13 జెడ్పీటీసీ, జనసేన రెండు చోట్ల, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేస్తోంది. జగ్గయ్యపేట, వీరులపాడు జెడ్పీటీసీ స్థానాలు జనసేనకు కేటాయించగా, విజయవాడ రూరల్‌ మండలాన్ని బీజేపీకి కేటాయించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కాకుండా ఎన్నికలు వాయిదా పడడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. అధికార పార్టీ ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తోంది.

సామగ్రి పంపిణీ..

ఎన్నికల సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని అందజేశారు. సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు సామాగ్రితో చేరుకున్నారు. ఇందుకోసం 188 బస్సులను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో 495 సమస్యాత్మక కేంద్రాలు

జిల్లాలో మొత్తం 495 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 291 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు అదనంగా 205 మంది వీడియోగ్రాఫర్లు, 191 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లు) నియమించారు. మొత్తం 89 రూట్లు, 45 జోన్లు ఏర్పాటు చేశారు.

పక్కా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌ లక్ష్మీశ

జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, జెడ్పీ సీఈవో పి.సుశీలతో కలిసి జెడ్పీ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల సౌకర్యార్థం సహాయ కేంద్రం (హెల్ప్‌ డెస్క్‌) అందుబాటులో ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రిసైడింగ్‌ అధికారులకు ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్‌ శాతాన్ని నమోదు చేసి, తక్షణమే తాజా వివరాలను పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోనూ 91549 70454 నంబరుతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉందని, అవసరానికి వినియోగించుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement