న్యూస్‌రీల్
ఉన్నతాధికారులు స్పందించేనా..
విజయవాడ జీజీహెచ్‌లో ఎవరి ఇష్టం వారిదే
ఆస్పత్రిలో సమయపాలన పాటించని సిబ్బంది ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఎఫ్‌ఆర్‌ఎస్ ఉన్నా పట్టించుకోని అధికారులు రోగుల సేవలపై తీవ్ర ప్రభావం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పాలన గాడితప్పంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరి ఇష్టం వారిదే అన్నట్లు సాగుతున్నారు. ఎవరు ఎప్పడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని దయనీయ స్థితి నెలకొంది. ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నైజ్డ్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్) ఉన్నా, అధికారులు దానిని పట్టించుకోక పోవడంతో సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. దీంతో ఆ ప్రభావం రోగులపై తీవ్రంగా చూపుతోంది. రోగికి ఏమైనా సీరియస్ అయితే ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదంటూ పలువురు రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల వివాదం కూడా జరిగింది. ఉద్యోగులపై పర్యవేక్షణ, అజమాయిషీ పూర్తిగా లోపించింది. తప్పు చేస్తే పనిష్‌మెంట్ ఉంటుందనే భయం లేకపోవడంతో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
2వేల మందికిపైగా ఉద్యోగులు, సిబ్బంది..
విజయవాడ జీజీహెచ్‌లో రెండు వేల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వారిలో దాదాపు 500 మంది స్టాఫ్‌నర్సులు ఉండగా, మరో 450 మంది వరకూ ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర పారామెడికల్ ఉద్యోగులు, ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలు థియేటర్ అసిస్టెంట్‌లు ఉన్నారు. వారితో పాటు మరో 300 మంది వరకూ వైద్యులు, 50 మంది వరకూ కార్యాలయంలో వివిధ కేడర్‌లలో పనిచేసే సిబ్బంది ఉంటారు. వీరందరికీ ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ ఉంటుంది. వీరితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యురిటీ, ఇతర కాంట్రాక్టుల్లో పనిచేసే వారు 700 మంది వరకూ ఉంటారు.
షిఫ్ట్ మారే సమయంలో అవస్థలు..
ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపించింది. దీంతో విధులకు ఆలస్యంగా రావడం, సమయానికంటే ముందు గానే వెళ్లిపోవడం జరుగుతోంది. జనరల్ షిఫ్ట్‌తో పాటు, ఇతర షిఫ్ట్ డ్యూటీల్లో చేసే వాళ్లు సమయానికి రావడం లేదు. తాము రావాల్సిన సమయానికి అరగంట ఆలస్యంగా రావడం.. వెళ్లాల్సిన సమయానికి అరగంట ముందుగానే వెళ్లిపోవడం చేస్తున్నారు. వాస్తవంగా షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్లు ఆ తర్వాత షిఫ్ట్ వాళ్లు వచ్చిన తర్వాత వారికి పని అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అలా చేస్తున్నారు. దీంతో షిఫ్ట్‌లు మారే సమయంలో గంట పాటు వార్డులో ఏ ఒక్కరూ ఉండక పోవడంతో రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోగికి ఏమైనా జరిగితే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎఫ్‌ఆర్‌ఎస్ పరిశీలించరా?
వాస్తవంగా ప్రతినెలా ఉద్యోగుల ఎఫ్‌ఆర్‌ఎస్ పరిశీలించాల్సి ఉంది. ప్రతిరోజూ డ్యూటీ సమయానికి వస్తున్నారా లేదా అనే అంశాన్ని సంబంధిత అధికారి పరిశీలించాలి. ఒకవేళ ఆలస్యంగా వస్తే, ప్రతి మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేయాల్సి ఉంది. ఇది కొన్ని చోట్ల అమలు జరుగుతున్నా, ప్రభుత్వాస్పత్రిలో మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు అధికారుల్లోనే సమయ పాలన లోపించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వార్డుల్లో ఏదైనా జరిగినప్పుడు మీది తప్పంటే.. మీది తప్పని ఒకరిపై ఒకరు నెట్టుకునే స్థితి నెలకొంది.
విజయవాడ జీజీహెచ్ అత్యవసర విభాగం(ఫైల్)
ప్రభుత్వాస్పత్రిలో గాడితప్పిన పాలనను మళ్లీ సరిచేసేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. అలాగే వదిలేస్తే పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ విషయమై సూపరింటెండెంట్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, మూడు రోజుల పాటు సెలవులో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.


