గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జనగణన (సెన్సస్) రెండో ప్రక్రియ అత్యంత కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చార్జ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తి అవగాహనతో, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం కల్పించామని, సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం రెండో దశ జనగణనపై సంబంధిత అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇలక్కియ మాట్లాడుతూ జనాభా గణనలో భాగంగా మొత్తం 40 ప్రశ్నలతో కూడిన వివరాలను మొబైల్ యాప్ ద్వారా సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. జనగణనకు 55 రోజుల వ్యవధి ఉంటుందన్నారు. జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 నాటికి ముగుస్తుందన్నారు. జిల్లాలోని 647 బ్లాక్‌ల వారీగా ఎన్యూమరేటర్లకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి, సమాచారాన్ని కచ్చితత్వంతో నమోదు చేసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
షెడ్యూల్ ఇలా..
డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ జనగణన రెండో దశ షెడ్యూల్‌ను వివరించారు. జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 35 రోజుల పాటు ఇంటింటి జనాభా గణన, అనంతరం మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజన్ రౌండ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర జనగణన కార్యకలాపాల శాఖ జాయింట్ డైరెక్టర్/సీఈఓ జి.ప్రసన్నకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటే షన్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విజయవాడ, తిరువూరు ఆర్డీఓలు వెన్నెల శ్రీను, ఎ. కుమార్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎ.రవీంద్రరావు పాల్గొన్నారు.
పచ్చదనం పెంపునకు కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనాన్ని మరింతగా పెంపొందించి, పర్యావరణ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రీన్ కవర్‌ను విస్తరించడంతో పాటు మొక్కల పెంపకం, సంరక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ‘డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ సొసైటీ రిజిస్ట్రేషన్, భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో కమిటీ సమావేశం జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏజెన్సీ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి.సుబ్రహ్మణ్యం రాఘవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి జి.సతీష్, జెడ్పీ సీఈఓ పి.సుశీల, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ


