విజయవాడలో ఒక్క రోజే మూడు కేసులు నమోదు రూ.48.57 లక్షలు లాగేసిన కేటుగాళ్లు టెలిగ్రామ్ ట్రేడింగ్ పేరుతో మరో రూ.58.67 లక్షలకు టోకరా జనాలను వణికిస్తున్న సైబర్ నేరగాళ్లు
మరో ఆన్‌లైన్ ట్రేడింగ్.. అధిక లాభాల పేరిట..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలో ఒకే రోజు మూడు డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కావడం కలకలం రేపింది. డిజిటల్ అరెస్టుపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ఇంకా వాటి బారిన పడుతూనే ఉన్నారు. మూడు సంఘటనలలో డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్స్ చేసి రూ.48.57 లక్షలను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. దీనిపై సైబర్ క్రైం, భవానీపురం, మాచవరం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. మరో కేసులో టెలిగ్రామ్ ట్రేడింగ్ పేరుతో రూ.58.67లక్షలు టోకరా వేయడంపై మరో కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాలు ఇవి..
సీనియర్ న్యాయవాది నుంచి రూ. 12 లక్షలు..
మొఘల్‌రాజపురానికి చెందిన త్రివిక్రమ వ్యాస్ 46 ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు గత నెల ఒకటిన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వీడియోకాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి తాను బెంగళూరు డీసీపీగా పరిచయం చేసుకున్నారు. మహిళలతో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చిందని, అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే రూ. 30లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తొలుత పది లక్షలు బదిలీ చేయగా, నాలుగు రోజుల తర్వాత మరో పది లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయగా అంత తన వద్ద లేదంటూ రెండు లక్షలు పంపించారు. తర్వాత తాను సైబర్‌మోసానికి గురి అయినట్లు గుర్తించి సైబర్ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉద్యోగ విరమణ చేసిన క్లర్క్ నుంచి రూ.4.57లక్షలు..
లబ్బీపేటలో నివసించే పరాస డేవిడ్ ఆనంద్ నగరపాలక సంస్థలో క్లర్క్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అతనికి జూలై 25న ఉదయం రెండు నంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్‌లో పోలీసు యూనిఫారంలో ఉన్న మహిళ మాట్లాడుతూ మీ పేరుతో ఉన్న మొబైల్ నంబర్ నుంచి ఒక యువతి అసభ్య ఫొటోలను ప్రచారం చేశారని, ఇది చూసి ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని బెదిరించింది. తర్వాత కొంతసేపటికి మళ్లీ ఫోన్ చేసి మీ వద్ద డబ్బులు ఎంత ఉన్నాయంటూ ఆరా తీసింది. తన వద్ద డబ్బులు లేవని, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉన్నాయని చెప్పగా, బ్యాంకుకు పంపించి, సత్యనారాయణపురంలోని కెనరాబ్యాంక్ నుంచి ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.4,57,000 బదిలీ చేయించుకుంది. తర్వాత తన కుమార్తెలతో ఈ విషయాన్ని చర్చించిన తర్వాత సైబర్ మోసానికి గురి అయినట్లు గుర్తించి ఫిర్యాదు చేశాడు. దీనిపై మాచవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
రిటైర్డ్ హెచ్‌ఎం నుంచి రూ.32లక్షలు..
భవానీపురానికి చెందిన ఒక ఉద్యోగ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయురాలు తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త గతంలో ఆటో నగర్‌లో ఇనుప వ్యాపారం చేసేవారు. ఆమెకు సెప్టెంబర్ పదో తేదీన మధ్యాహ్నం సమయంలో వై. భావశర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతను మదన్ కుమార్ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు.సదరు వ్యక్తి, ఆమె సుభాత్ ఖాన్ అనే నేరస్తుడితో లావాదేవీల ద్వారా మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణాలో పాలుపంచుకుందని, కెనరా బ్యాంక్ నుంచి కమీషన్లు అందుకుందని తప్పుడు ఆరోపణలు చేసి, ఆమె బ్యాంక్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు ఇవ్వమని బెదిరించాడు. మళ్లీ తర్వాత రోజు వాట్సాప్ ద్వారా ఆమెను మళ్లి సంప్రదించి ఆర్‌టీజీఎస్ ద్వారా రూ. 20లక్షలు బదిలీ చేయాలని బెదిరించారు. అలా చేయని పక్షంలో, ఆమె పిల్లల వైద్య లైసెన్సులు, పాస్‌పోర్టులు, వీసాలను నిలిపివేస్తామని, అలాగే మీడియాకు చెప్పడంతో పాటు సుప్రీం కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తెచ్చి ఆమెను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె భయపడి తన ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ. 20లక్షలు బదిలీ చేసింది. తర్వాత రోజు మరో రూ.12 లక్షలు బదిలీ చేసింది. ఇంకా బెదిరింపులు ఆగకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
టెలిగ్రామ్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.58.67లక్షలు కాజేశారు. తొలుత చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చినట్లు నమ్మించి, ఆ తర్వాత భారీ మొత్తాలు పెట్టుబడిగా పెట్టించుకుని నగదుతో ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏం జరిగిందంటే..
విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన నల్లూరు వెంకట సుబ్బారావు(56) గతంలో కృష్ణ వేణి క్లాత్ మార్కెట్‌లోని కరిష్మా అపారెల్స్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ ఏడాది మార్చి 27న గుర్తుతెలియని నంబర్ నుంచి ఆయనకు వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ వ్యక్తి కొన్ని పనులు చేయాలని కోరగా, తొలుత గూగుల్‌లో రేటింగ్స్ ఇవ్వడం వంటి చిన్న పనులు అప్పగించారు. వాటిని పూర్తి చేసినందుకు కొంత మొత్తం చెల్లించారు. తర్వాత టెలిగ్రామ్ ద్వారా స్నేహ సాల్వి అనే వ్యక్తిని సంప్రదించాలని సూచించారు. ఆమె ద్వారా ఆన్‌లైన్ టాస్కులు, ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో కొత్త వ్యవహారం ప్రారంభమైంది. మొదట రూ.5వేలతో పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు, లాభాలు వచ్చినట్లు నకిలీ వివరాలు చూపించి బాధితుడి నమ్మకాన్ని పొందారు. దీంతో మరింత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి విడతలవారీగా నగదు బదిలీ చేయించుకున్నారు. అయితే ఎంత డబ్బు పెట్టినా ఉపసంహరణ సాధ్యం కాలేదు. మరింత నగదు పెట్టుబడిగా పెట్టాలని ఒత్తిడి చేయడంతో మోస పోయినట్లు బాధితుడు గుర్తించారు. 2026 మార్చి 28 నుంచి ఏప్రిల్ 29 వరకు బాధితుడు మొత్తం రూ.58,67,800ను మూడు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరిగా భారీ మొత్తాన్ని బదిలీ చేసిన తర్వాత అవతలి వ్యక్తులు స్పందించడం మానేశారు. పెట్టిన పెట్టుబడులు, వచ్చినట్లు చూపించిన లాభాలు ఏవీ తిరిగి అందకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.


