రగులుతున్న జనసేన! | - | Sakshi
Sakshi News home page

రగులుతున్న జనసేన!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

రగులుతున్న జనసేన! టీడీపీ వెన్నుపోటు

పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు సీట్లు ఇచ్చి రెండూ ఓడించారు కృష్ణాలోనూ ఇబ్బందులే మొవ్వలో టీడీపీ రెబల్‌ని గెలిపించారు పంచాయతీ ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామంటున్న ‘జనసేన’

సాక్షి ప్రతినిధి, విజయవాడ: పరిషత్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఓటమితో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇచ్చిన రెండు సీట్లలోనూ ఓటమి పాలుకావడం, దానికి టీడీపీ నేతల తీరే కారణం కావడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల వారిని ఓడించడంలో టీడీపీ స్థానిక నేతలు కీలకంగా పనిచేశారన్న అనుమానాలు ఆ రెండు పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మిత్రపక్షాలు గెలిస్తే భవిష్యత్‌లో ఆ సీట్లు తమకు దక్కకుండా పోతాయన్న దుగ్ధతో ఈ పని చేశారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. తమకు తక్కువ స్థానాలు కేటాయించినా ఆ అసంతృప్తిని బయట పెట్టకుండా కూటమి గెలుపు కోసం పనిచేస్తే, టీడీపీ మాత్రం తమ ఓటమిలో పెద్దన్న పాత్ర వహించిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది.

కావాలనే ఓడించారని..

ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలను కేటాయించగా రెండింటిలో జనసేన ఓటమి చవి చూసింది. కృష్ణా జిల్లాలో మొవ్వ స్థానం జనసేనకు కేటాయించగా అక్కడ టీడీపీ నేత రెబల్‌గా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో జనసేనకు ఇచ్చిన సీట్లను టీడీపీ నేతలే కావాలని ఓడించారన్న భావనలో జనసేన ఉంది. పామర్రు నియోజకవర్గంలో ఐదు జెడ్పీటీసీలు, ఐదు ఎంపీపీలు ఉండగా మొవ్వ ఒక్కటే జనసేనకు కేటాయించారు. అక్కడ కూడా టీడీపీ రెబల్‌గా నన్నపనేని వీరేంద్ర పోటీలో నిలుచున్నారు. టీడీపీ నేతలు కావాలని జనసేనకు వెన్నుపోటు పొడిచి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారన్న భావనలో వారు ఉన్నారు. టీడీపీ రెబల్‌ 6,668 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.

బీజేపీలోనూ ఇదే అసంతృప్తి

బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగిన గన్నవరం కూడా ఓడిపోవడంతో స్థానిక ఎమ్మెల్యేపై అనుమానాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమలో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. 53, 58 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఈ పరిణామాలు కూటమి స్థానిక సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తింది. పొత్తులో భాగంగా ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో, మరో పార్టీకి చెందిన రెబల్‌ అభ్యర్థులు పోటీ చేయడం, పోటీ లేనిచోట కూడా సహకరించకుండా ఓడించడంతో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అవకాశం ఉన్న చోట్ల తాము కూడా సహాయ నిరాకరణ చేస్తామంటూ జనసేన నేతలు నేరుగా టీడీపీ ఎమ్మెల్యేల వద్ద స్పష్టం చేస్తుండటంతో వారు నష్ట నివారణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇప్పుడు పమిడిముక్కల ఎంపీపీ కోసం జనసేన పట్టుపడుతోంది. ఆ సీటు అయినా ఇస్తారా లేదా అన్న అనుమానాలను జనసేన కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో తక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన చోట్ల కూడా వెన్నుపోటు పొడవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జగ్గయ్యపేట జెడ్పీటీసీ కేటాయించినా అక్కడ కూడా టీడీపీ నేతలు సహకరించలేదని సమాచారం. జనసేనలో కీలకంగా ఉన్న ఉదయభాను సొంత మండలంలో జనసేన అభ్యర్థికి సహాయ నిరాకరణ చేశారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నందిగామ నియోజకవర్గంలో కూడా వీరులపాడు జెడ్పీటీసీలో జనసేనకు ఓటమి ఎదురైంది. పలు ఎంపీటీసీ స్థానాల్లో కూడా స్థానిక టీడీపీ నేతల సహాయ నిరాకరణ కారణంగా ఓటమి ఎదురవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో 26వ డివిజన్‌లో కూడా జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement