దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ మంత్రి ఆనం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ మంత్రి ఆనం

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ మంత్రి ఆనం డీఆర్‌డీఎల్‌తో సిద్ధార్థ ఎంఓయూ నిత్యాన్నదానానికి విరాళం కృష్ణా వర్సిటీ ‘ఆక్వాటిక్స్‌’ జట్టు ఎంపిక

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి రామనారాయణరెడ్డికి ఆలయ ఈవో శీనానాయక్‌ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో శీనానాయక్‌ మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు. దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం, అమ్మవారి గాజుల ఉత్సవం, కార్తిక విశేష పూజలను ఈవో శీనానాయక్‌ మంత్రికి వివరించారు. భవానీ దీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి.. ఆలయ అధికారులకు సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని డోనర్‌ సెల్‌లో దుర్గగుడి చైర్మన్‌ రాధాకృష్ణ, మంత్రి ఆనం కలిసి చర్చించారు.

పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్‌)తో ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు గురువారం శాస్త్రవేత్త డాక్టర్‌ అంకతిరాజు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఆయన మాట్లాడుతూ కీలక పరిశోధనలు, క్షిపణి వ్యవస్థ రూపకల్పన, ఎరోడైనమాక్స్‌, నేవి గేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో డీఆర్‌డీఎల్‌ విశేష కృషి చేస్తోందన్నారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీల్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పీఎం నరేంద్రమోదీ ఆశయాలకనుగుణంగా వికసిత్‌ భారత్‌–2047 సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డీఆర్‌డీఎల్‌ ఎంఓయూ చేసు కోవడంతో పరస్పర సహకారానికి నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎల్‌ టెక్నాలజీ హెడ్‌ డాక్టర్‌ కృష్ణమోహన్‌, ప్రో ఉపకులపతి డాక్టర్‌ రత్నప్రసాద్‌, డీన్‌లు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు రూ.3.80 లక్షల విరాళాన్ని అందజేశారు. కానూరుకు చెందిన దాసరి రవికుమార్‌ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానం నిమిత్తం రూ. 3,80,111 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయ అంతర కళాశాలల ఆక్వాటిక్స్‌ (పురుషుల – మహిళల) చాంపియన్‌షిప్‌, యూనివర్సిటీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 19 తేదీ ఈడుపుగల్లులోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహిస్తున్నామని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, చాంపియన్‌షిప్‌ చైర్‌పర్సన్‌ కె.భాగ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితా, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పాస్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌తో అటెస్ట్‌ చేయించి ఆ పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు పోటీలు జరిగే ప్రాంతానికి నేరుగా హాజరుకావాల్సిందిగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement