కొండపల్లి కౌంటింగ్‌ కేంద్రంలో అర్ధరాత్రి కలకలం | - | Sakshi
Sakshi News home page

కొండపల్లి కౌంటింగ్‌ కేంద్రంలో అర్ధరాత్రి కలకలం

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

బ్యాలెట్‌ బాక్సులు మారుస్తున్నారనే అనుమానం అభ్యంతరం తెలిపినవైఎస్సార్‌సీపీ నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళన కూలర్‌లు బిగిస్తున్నామని అధికారుల వివరణ

ఇబ్రహీంపట్నం: కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద అర్ధరాత్రి చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా కలకలం రేపాయి. కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ ఉన్న ప్రాంతంలో రాత్రి వేళ కొందరు వ్యక్తులు సంచరించడాన్ని గమనించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు బ్యాలెట్‌ బాక్సులను మారుస్తున్నారేమోనన్న సందేహంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రంలో కూలర్‌లు బిగించే పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే అర్ధరాత్రి వేళ, అదీ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో కూలర్‌లు బిగించాల్సిన అవసరం ఏమిటని వైఎస్సార్‌ సీపీ నాయకులు గుంజా శ్రీనివాస్‌ తదితరులు ప్రశ్నించారు. కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ ఉన్న ప్రాంతంలోకి అర్ధరాత్రి వ్యక్తులు వెళ్లడం ఎన్నికల భద్రతా నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం తెలిపారు. సీఐ సుబ్రహ్మణ్యం స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలను పరిశీలించారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అధికారులు తగిన వివరణ ఇవ్వాలని నాయకులు కోరారు. పోలీసులు పరిస్థితిని సమీక్షించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అర్ధ రాత్రి వేళ ఆర్డీఓ శ్రీనివాసరావు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకుని పరిశీలించి అధికారుల తీరుపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement