కొత్త కేసుల్లేవ్‌.. అదుపులో డయేరియా | - | Sakshi
Sakshi News home page

కొత్త కేసుల్లేవ్‌.. అదుపులో డయేరియా

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్‌ క్లోరినేషన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్‌ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న పలువురు బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య శిబిరాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. బాధితులకు అందిస్తున్న మందులపై ఆరా తీశారు. ఎస్సీ కాలనీలో పైపులైను మార్పిడి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యూరులో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా ఇంకా ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కొత్త కేసులు నమోదు కాలేదన్నారు.

ఆ సమయంలో పైపుల్లో నీటిని వాడొద్దు..

ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా డయేరియా కేసులు పునరావృతం కాకుండా ఉయ్యూరు పట్టణంలో తాగునీటి సూపర్‌క్లోరినేషన్‌ అమలుకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్‌ చెప్పారు. వాటర్‌ ట్యాంకులతో పాటుగా డైరెక్టు పంపింగ్‌లను సమయం వారీగా అత్యవసరంగా క్లోరినేషన్‌ చేస్తున్నారన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎవరూ పైపుల్లో వచ్చే నీటిని వినియోగించవద్దని సూచించారు. వైద్య సిబ్బందితో ఇంటింటికీ క్లోరిన్‌ మందులు అందిస్తామన్నారు. అవసరమైన చోట్ల పైపులు మార్పు చేసే పనులు చేపట్టామన్నారు. పట్టణ ప్రజలు అందరూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోక్‌నాథ్‌ దయాకర్‌, ఆర్‌డీఓ కరుణకుమారి, మునిసిపల్‌ కమిషనర్‌ సుభాష్‌చంద్రబోస్‌, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ప్రత్యేకాధికారి డాక్టర్‌ సాయికిరణ్‌, వైద్య బృందం పాల్గొన్నారు.

ఉయ్యూరులో పర్యటించిన

కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement