లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.20.40 లక్షల బీమా చెక్కును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అందజేశారు. వివరాల ప్రకారం వీరులపాడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ మొగిలి ప్రభుకుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 26న విధులు ముగించుకుని ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. దీంతో రాష్ట్రంలోని హోంగార్డులతో పాటు అన్ని కేడర్ పోలీసు సిబ్బందికి వర్తించే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం రూ.20.40 లక్షలు చెక్కురూపంలో ప్రభుకుమార్ కుమారుడు అఖిల్‌బాబుకు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ది న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ ఎస్‌వీ సుబ్బారావు, స్థానిక డివిజనల్ కార్యాలయ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


