సంగీతం, సాహిత్యం.. జ్ఞానాన్ని పెంచే సాధనాలు | - | Sakshi
Sakshi News home page

సంగీతం, సాహిత్యం.. జ్ఞానాన్ని పెంచే సాధనాలు

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సంగీత, సాహిత్యాలు జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప సాధానాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. యువత పాశ్చాత్య పొకడల వైపు అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతికి దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భాషా–సాంస్కృతిక శాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావనా వాహిని సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కేబీఎన్‌ కళాశాలలో నిర్వహించిన ‘జగద్గురు అన్నమాచార్య’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత అన్నమయ్య కీర్తనల అంతరార్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించాలని సూచించారు.

మానవ విలువలకు ప్రతీకలు..

రాష్ట్ర సృజనాత్మకత–సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ సంగీతం, సాహిత్య సమ్మేళనంతో అన్నమయ్య పదకవిత్వానికి చిరస్థాయితనం లభించిందన్నారు. పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు మానవ విలువలకు ప్రతీకలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. కృష్ణవేణి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సెక్రటరీ డాక్టర్‌ టి. శ్రీనివాసు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు సాహిత్యానికి అమూల్య వారసత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ‘పదకవితా వసంతం అన్నమయ్య’ గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం వందలాది మంది విద్యార్థులు సామూహికంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, పరిపాలనాధికారి డాక్టర్‌ వి. నారాయణరావు, కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement