లబ్బీపేట(విజయవాడతూర్పు): విధుల పట్ల ఉదాసీనత లేకుండా, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన బుధవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ, ముత్యాలం చెరువు యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది ముఖ హాజరును పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీలో జరుగుతున్న ప్రసవాలను పరిశీలించి, గర్భిణులు, మాతాశిశు సంరక్షణ సేవలను అడిగి తెలుసుకున్నారు. మరింత నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలన్నారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌ను సందర్శించి, అక్కడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీపీఎంఓ డాక్టర్ నవీన్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీం, సీహెచ్‌ఓ నారాయణరావు పాల్గొన్నారు.
తిరువూరు: ‘బెల్టు బేరం.. రాబడి అధనం’ శీర్షికన సాక్షి దిన పత్రికలో బుధవారం వచ్చిన వార్తకు తిరువూరు ఎకై ్సజ్ సర్కిల్ అధికారులు స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 330 బెల్టు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు వాటి నిర్వాహకులను అరెస్టు చేసి 3,919 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు మండలంలో 62 మందిని, గంపలగూడెంలో 129 మందిని, ఏకొండూరు మండలంలో 51 మందిని, విస్సన్నపేట మండలంలో 52 మంది బెల్టు దుకాణాల నిర్వాహకులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ నిక్సన్ తెలిపారు.


