అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ప్రజల నుంచి 187 అర్జీలు స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను నిర్ధేశిత గడువులోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఆన్‌లైన్‌లో డిస్పోజ్‌ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పెండింగ్‌లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఎరువులు అందుబాటులో ఉంచండి..

రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలాల వారీగా నియమితులైన స్పెషల్‌ అధికారులు ఆయా మండలాలను సందర్శించి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించాలంటే సంబంధిత అధికారులందరికీ పెట్టుబడుల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారిని, స్టార్టప్‌ వ్యవస్థాపకులను ప్రోత్సహించాలని, వారిని జీఎం–డీఐసీ లేదా సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌ డెస్క్‌ అధికారులతో అనుసంధానించాలని ఆదేశించారు.

అర్జీల వివరాలు..

పీజీఆర్‌ఎస్‌ ద్వారా 187 అర్జీలు అందాయని కలెక్టర్‌ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంఽధించి 51, మునిసిపాలిటీలకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహ, పీజీఆర్‌ఎస్‌ జిల్లా నోడల్‌ అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement