అన్నదానానికి పలువురి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి పలువురి విరాళాలు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు బుధవారం విరాళాలు అందజేశారు. విజయవాడ గాంధీనగర్‌కు చెందిన దిట్టకవి వెంకట సుబ్బరాయ్‌ శర్మ తన తల్లి అలివేలు పేరిట అమ్మవారి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన పర్వతం గోపీచంద్‌ తన భార్య భరణి పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.

దసరా ఉత్సవాలపై తొలి సమీక్ష సమావేశం

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల తొలి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈఓ ఛాంబర్‌లో ఈఓ శీనానాయక్‌ అధ్యక్షతన ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్‌ అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలను త్వరగా సిద్ధం చేయాలని వైదిక కమిటీని, అదే విధంగా క్యూలైన్లు, ఇతర ఇంజినీరింగ్‌ పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఆలయ ఈఓ శీనానాయక్‌ ఆలయ అధికారులను ఆదేశించారు. రానున్న దసరా ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన రీతిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులపై సమగ్రంగా అంచనాలను రూపొందించడంతో పాటు అంచనా వ్యయం వెంటనే సిద్ధం చేయాలన్నారు. దసరా ఉత్సవాల ప్రతిపాదనలను రానున్న ట్రస్ట్‌ బోర్డు సమావేశం నాటికి సిద్ధం చేయడంతో పాటు పాలకవర్గ ఆమోదం కోసం పంపాలన్నారు. ప్రభుత్వం నుంచి, దేవదాయ శాఖ నుంచి అనుమతి పొందాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేక నివేదికను తయారు చేయాలన్నారు. అన్ని విభాగాల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఈఓ ఎన్‌. రమేష్‌బాబు, చంద్రశేఖర్‌, తిరుమలేశ్వరరావు, ఈఈ ఎల్‌.రమాదేవి, ఏఈఈలు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఏసీఏ అండర్‌–19 మహిళల చాంపియన్‌ కృష్ణా

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో అండర్‌–19 మహిళల వన్‌–డే ఇంటర్‌–జోనల్‌ టోర్నమెంట్‌ విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగింది. ఈ నెల 15 నుంచి ఈ టోర్నమెంట్‌లో భాగంగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌ బుధవారం నిర్వహించారు. అనంతపురం జిల్లా జట్టు, కృష్ణాజిల్లా జట్ల మధ్య ఈ మ్యాచ్‌ జరిగింది. అనంతపురం జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని 50 ఓవర్లల్లో 166/5 స్కోర్‌ చేసింది. తర్వాత కృష్ణా జిల్లా జట్టు బ్యాటింగ్‌ చేసి 42.1 ఓవర్లలో 169/4 స్కోర్‌ చేసింది. 6 వికెట్ల తేడాతో 0.808 రన్‌ రేట్‌తో ఏసీఏ ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌ చాంపియన్‌గా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది.

రాజీవ్‌ నగర్‌లో వ్యక్తి బలవన్మరణం

పాయకాపురం(విజయవాడరూరల్‌): రాజీవ్‌నగర్‌కు చెందిన పొలిమర మోహన్‌వంశీ (23) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో వెంకటరమణ అనే యువతిని మోహన్‌వంశీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. పనికి వెళ్లకుండా జులాయిగా తిరగడానికి అలవాటు పడిన మోహన్‌వంశీ భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దంపతులు మధ్య వివాదం జరిగిన అనంతరం నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో భార్య లేచిచూడగా మోహన్‌వంశీ కనిపించలేదు. అతని కోసం చూడగా పక్కగదిలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించగా అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని పెజ్జోనిపేటలో ఉంటున్న అతని తల్లికి సమాచారం అందించింది. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement