విదేశీ ఉద్యోగాల పేరుతో మోసంచేసిన దంపతుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసంచేసిన దంపతుల అరెస్టు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

● విజయవాడలోనే 700 మంది నుంచి రూ. 11.5 కోట్లు వసూలు ● బాధితులు మరింత పెరిగే అవకాశం

● విజయవాడలోనే 700 మంది నుంచి రూ. 11.5 కోట్లు వసూలు ● బాధితులు మరింత పెరిగే అవకాశం

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందల మంది నిరుద్యోగులను మోసం చేసి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ జి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాకకు చెందిన ముసునూరి శ్రీనివాస్‌, సౌజన్య దంపతులు. సౌజన్య 2023లో నగరంలోని పంటకాలువ రోడ్డులోని ఒక కన్సల్టెన్సీలో పనిచేసింది. ఆ సమయంలో స్టూడెంట్‌ వీసాకు సంబంధించిన ప్రాసెస్‌ బాగా తెలుసుకుంది. నెదర్లాండ్‌, ఐర్లాండ్‌, లక్సెంబర్గ్‌, ఫిన్లాండ్‌ దేశాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఆమెకు తెలుసు. వర్కు వీసా అనుభవంతో నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశంతో భర్తలో కలిసి ఒక పథకం ప్రకారం ‘ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ కన్సల్టెన్సీ’ పేరుతో విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యాలయాలు ఏర్పాటు చేసి సోషల్‌ మీడియా, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రకటనలకు అకర్షితులైన వందల సంఖ్యలో నిరుద్యోగులు వారి కార్యాలయాలకు క్యూ కట్టారు.

పథకం ప్రకారం నిరుద్యోగులను మోసం..

ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ సిల్డ్‌ కేటగిరీలుగా విభజించి పలు దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 8 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు వసూలు చేశారు. ముందుగా 50 శాతం డబ్బులు ఎన్‌రోల్‌మెంట్‌, ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో వసూలు చేసేవారు. అనంతరం వారి సిబ్బందితో అభ్యర్థులకు పలు కంపెనీల ప్రతినిధులుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఫెయిల్‌ అయినట్లు నకిలీ ఫీడ్‌బ్యాక్‌ను చాట్‌ జీపీటీ ద్వారా తయారు చేయించి దానిని ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ సంస్థ పేరుతో ఉన్న మెయిల్‌ నుంచి అభ్యర్థులకు పంపించేవారు. కొంత మంది బాధితులు పదే పదే నకిలీ ఇంటర్వ్యూలకు హాజరవుతూ, పదే పదే విఫలమవుతూ ఉండటంతో వారికి అనుమానం రావటంతో బాధితులు పలు పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయడంతో దంపతుల మోసం వెలుగులోకి వచ్చింది. వీరిపై విజయవాడలోని సూర్యారావుపేట, మాచవరం, అజిత్‌సింగ్‌ నగర్‌, సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లు, అన్యమయ్య జిల్లాలోని పీలేరు, తెలంగాణ జగిత్యాల జిల్లాలోని మహిళా పీఎస్‌, కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో నిందితుల అరెస్టు..

దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి హైదరాబాద్‌లో ఉన్న నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఒక్క విజయవాడలోనే 700 మంది నిరుద్యోగుల నుంచి రూ. 11.5 కోట్లు వసూళ్లు చేయగా హైదరాబాద్‌, విశాఖలో వందల మంది బాధితులు ఉన్నారని వారి నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో నార్త్‌ డివిజన్‌ ఏసీపీ పి.సత్యానందం, ఎస్‌ఎన్‌పురం ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement