ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అత్యధిక జీడీపీ వృద్ధి నమోదు చేసే జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థూల దేశీయోత్పత్తి, మండల అభివృద్ధి ప్రణాళిక అంశాలపై జిల్లా స్థాయి అధికారులకు సామర్థ్య పెంపుపై వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.93,112 కోట్లుగా ఉన్న జిల్లా జీడీపీని 2028–29 నాటికి రూ.1.64 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఏడాది 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసేలా శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. రంగాల వారీ వృద్ధిరేటును వివరించారు. స్థానిక వనరుల వినియోగం, వివిధ శాఖల సమన్వయం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, డేటా ఆధారిత ప్రణాళికలు, ప్రాక్టికల్ అమలు విధానాలపై పహ్లే ఇండియా ఫౌండేషన్ రూపొందించిన నమూనాలను మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ జాయింట్ డైరెక్టర్ అనుపమ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డీవీ శివరామ ప్రసాద్, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసన్, పహ్లే ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


