యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ పోటీల విజేతలు వీరే.. అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌ పరిశీలన టెక్నాలజీతో నైపుణ్యం పెంపు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. కలెక్టర్‌ జి.లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ యువతకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా నుంచి 15,300 మంది విద్యార్థులు, యువత, యోగా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాంధ్ర కార్య క్రమంలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొల్లేటి రమేష్‌, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ వై.రత్నప్రియదర్శిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధి కారి కోటేశ్వర రావు పాల్గొన్నారు.

విశాఖ స్పోర్ట్స్‌: అంతర్‌ జిల్లాల సబ్‌జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ శనివారం విశాఖలోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభమైంది. జిల్లా స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పోటీల్లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలబాలికలకు ఫ్రీస్టైల్‌, బ్యాక్‌స్ట్రోక్‌, బ్రెస్ట్‌స్ట్రోక్‌, బటర్‌ఫ్లైతో పాటు మెడ్లే విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ వయో విభాగాల్లో 50 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు జరిగిన పోటీల్లో విజేతలను రాష్ట్ర జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన వారిని స్టాండ్‌బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా నుంచి కేటగిరీ–3 100 మీటర్ల బాలుర విభాగం బటర్‌ఫ్లై, బ్యాక్‌ స్ట్రోక్‌ రెండు అంశా ల్లోనూ చరిత్‌ ఆదిత్య విజేతగా నిలిచాడు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి కేటగిరీ–2 బటర్‌ఫ్లై బాలురు విభాగంలో రామ మణికంఠ, బాలికల్లో యానా జైన్‌, అదేవిధంగా కేటగిరీ–1బి బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ అంశంలో లిపి, ఫ్రీస్టైల్‌ అంశంలో లాస్యశ్రీ విజేతలుగా నిలిచారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌ను ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు శనివారం పరిశీలించారు. మానవ వనరులు, సాంకేతికత ఆధారిత, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భవిష్యత్‌ నేరాల కట్టడి కోసం ఏపీ పోలీసులను పునర్వవస్థీకరించే లక్ష్యంతో ఈ నెల 22, 23 తేదీల్లో ‘ఫ్యూచర్‌ – రెడీ ఏపీ పోలీస్‌’ వర్క్‌షాప్‌ అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహిస్తామని ఏడీజీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వర్క్‌షాప్‌ నిర్వహణ సన్నాహాల నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌తో కలిసి కన్వెన్షన్‌ హాల్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ పకీరప్ప, డీసీపీలు కృష్ణకాంత్‌పటేల్‌, షిరీన్‌ బేగం, డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, బి.లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువత వారిలోని నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్‌ ఆధ్వర్యాన సీఏ విద్యార్థులకు శనివారం అన్వికా పేరుతో మెగా కాన్ఫరెన్స్‌ జరిగింది. మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ యువత చేతిలోనే ఉందన్నారు. దేశ సంపదను పెంచే బాధ్యత సీఏలపైనే ఉందన్నారు. నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని సూచించారు. హెల్త్‌, వెల్త్‌ ఉంటే హ్యాపీగా ఉంటా రని చెప్పారు. సదరన్‌ ఇండియా రీజనల్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐఆర్‌సీ) చైర్మన్‌ ముప్పాల సుబ్బారావు, వైస్‌ చైర్మన్‌ మండవ సునీల్‌ కుమార్‌, రీజనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు యర్రా తిరుపతయ్య, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్‌ చైర్మన్‌ ఉప్పులూరి జయంత్‌, కార్యదర్శి వి.వీరపవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సీఏ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement