గన్నవరం: దసరా నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయంలో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, సాంకేతిక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పాత కాంట్రాక్టు సంస్థకు ఉన్న సమస్యల వల్ల ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. కొత్త సంస్థకు పనులు అప్పగించిన తర్వాత నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వారణాసి మీదుగా కోల్‌కతాకు నూతన సర్వీస్‌లను ఆగస్టు 13 నుంచి ప్రారంభిస్తామన్నారు. వారణాసి విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దీనివల్ల ప్రాంతీయ విమానాశ్రయాల్లోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని, హబ్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేయొ చ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. విజయవాడ, విశాఖ, మరో ఐదు ఎయిర్‌పోర్ట్‌లకు ఈ సేవలను విస్తరిస్తా మని వివరించారు. ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్‌కుమార్ పాల్గొన్నారు. టెర్మినల్ నిర్మాణ పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు కేటాయించడంపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గైర్హాజరయ్యారు.


