బుక్‌ ఫెస్టివల్‌ బాబ్జీ అస్తమయం | - | Sakshi
Sakshi News home page

బుక్‌ ఫెస్టివల్‌ బాబ్జీ అస్తమయం

Jul 17 2026 7:21 AM | Updated on Jul 17 2026 7:21 AM

బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ప్రధాన భూమిక అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వైనం పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించనున్న కుటుంబ సభ్యులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రముఖ పబ్లిషర్‌, విజయవాడ పుస్తకమహోత్సవ సంఘం పూర్వ అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ (78) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది కాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని రామవరప్పాడు సమీ పంలో వైస్‌ఎల్‌వీ అమరావతీ గ్రాండ్‌–1లోని స్వగృహంలో ఉంచారు. వైద్య విద్యార్థుల ఉపయోగార్థం ఆయుష్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి బాబ్జి పార్థివ దేహాన్ని శుక్రవారం అప్పగించనున్నారు. బాబ్జీకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీకి 2015–16, 2016–17 కాలంలో రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2018 నుంచి 2024 వరకూ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పుస్తక మహోత్సవం స్వరాజ్యమైదానం నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ మైదానానికి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియానికి మారిన సందర్భాల్లో ప్రదర్శనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రచురణ కర్తగా..

బెల్లపు బాబ్జీ 1948 ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, దోసపాడు గ్రామ సమీపంలోని రావులపాడులో రైతు బెల్లపు వేణు గోపాలరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పెద్ద తండ్రి వెంకట్రామయ్య విశాలాంధ్ర సంస్థలో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆ క్రమంలో ఆయన చొరవతో విజయవాడకు వచ్చిన బాబ్జీ కొద్ది రోజులు ఆయనతో కలిసి అడుగులు వేశారు. అనంతరం 1968లో స్టూడెంట్‌ బుక్‌ సెంటర్‌ అనే ప్రచురణ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు, పలు ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకాలను విక్రయిస్తూనే తమ సంస్థ పేరు మీద ప్రముఖ రచయితల రచనలను ప్రచురించారు. వాసిరెడ్డి సీతాదేవి వంటి ప్రముఖుల రచనలతో పాటుగా బాపు, బాలి వంటి ప్రముఖుల చిత్రాలతో కూడిన పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా..

నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సహకారంతో 1989లో విజయవాడలో తొలి సారిగా పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయగా బాబ్జీ దానిలో కీలక పాత్ర పోషించారు. నగరంలోని పుస్తక ప్రచురణకర్తలు 1990లో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు విజయవాడ పుస్తక మహోత్సవం విజయవంతమయ్యేలా కృషి చేశారు. ప్రచురణకర్తల మధ్య సమ న్వయం, అతిథులతో కార్యక్రమాల రూపకల్పనలో ఆయనదే కీలక పాత్ర. బాబ్జీ పార్థివ దేహం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. బాబ్జీ మరణం సొసైటీకి తీరని లోటుని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. పలు సంస్థల నిర్వాహకులు, బాధ్యులు, సాహితీవేత్తలు, జర్నలిస్టు సంఘాల బాధ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement