కంచికచర్ల: కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ భారత యువ రచయితల ఉత్సవంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని కంచికచర్ల గ్రామానికి చెందిన కవి, రచయిత తంగిరాల సోనీ గురువారం తెలిపారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆరు రాష్ట్రాల నుంచి కన్నడ, కొడవ, మళయాళం, తుళు, మలైయాళి, తెలుగు భాషల నుంచి యువ కవులను ఎంపిక చేశారని సోనీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు నుంచి తనకు ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. సోనికి పలువురు కవులు, కళాకారులు, రచయితలు అభినందనలు తెలిపారు.
గన్నవరం: క్రికెట్ మ్యాచ్‌లో తలెత్తిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కేసరపల్లి శివారు వి.ఎన్.పురం కాలనీకి చెందిన ఈడే వెంకటరామ చంద్(17) ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఈ నెల 14వ తేదీన స్థానిక జెడ్పీ బాలుర హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. మ్యాచ్ విషయమై వెంకటరామచంద్, గన్నవరానికి చెందిన గోపీచంద్ మధ్య వివాదం తలెత్తింది. వీరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన గోపీ చంద్‌తో పాటు ఆతని స్నేహితులు రాకేష్, ఆనంద్, మణికంఠ బ్యాట్‌తో వెంకటరామ చంద్‌ను తీవ్రంగా కొట్టారు. తలకు బలమైన గాయాలైన వెంకటరామచంద్ విజయవాడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతడి మృతదేహానికి గురువారం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీఎన్.పురం కాలనీలో వెంకటరామచంద్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడు తండ్రి ఈడే దుర్గాపవన్‌కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వెంకట రామచంద్ పాడెను వంశీమోహన్ మోశారు.


